వైసీపీ అధికారంలోకి రావడంతో.. సాక్షి పత్రికకు మంచి రోజులు వచ్చాయి. ఓ వైపు సర్క్యూరేషన్ పరంగా.. ప్రభుత్వ నిధులతో.. కొన్ని వేల కాపీలు వివిధ డిపార్టుమెంట్లతో కొనిపించిడమే కాదు.. ప్రకటనలు కూడా ఫుల్ పేజీలకు పేజీలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సాక్షి ఉద్యోగుల్లో దాదాపు సగం మందిని ఔట్ సోర్సింగ్ ద్వారా.. ప్రభుత్వంలోకి తీసుకుని.. వారికీ జీతాలు చెల్లిస్తున్నరు. ఇప్పుడు.. మరింత తైలం పిండుకునేందుకు సాక్షి ప్రకటన రేట్లను.. ఏకంగా రెండింతలు చేసినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా… సర్క్యూలేషన్ ను.. రీడర్ షిప్ను బట్టి ఓ ప్రమాణం ప్రకారం.. ప్రకటన రేట్లను నిర్దారించుకుంటారు. ఈ క్రమంలో.. ఈనాడు పత్రికకు… అన్నింటి కంటే ఎక్కువ రేట్లు ఉంటాయి.
అయితే.. ప్రైవేటు వాణిజ్య సంస్థల ప్రకటనలకు… ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలకు.. వేర్వేరు టారిఫ్లు ఉంటాయి. ప్రభుత్వం ఓ రేటు ఫిక్స్ చేస్తుంది. దాని ప్రకారమే… ఐ అండ్ పీఆర్ ఇచ్చే ప్రకటనలకు.. డబ్బులు చెల్లిస్తారు. దానికో ప్రమాణం ఉంటుంది. ఇప్పుడు.. సాక్షి పత్రికకు ఇచ్చే రేటును.. అమాంతం పెంచేస్తూ.. ఐ అండ్ పీఆర్ నిర్ణయం తీసుకుంది. ఈ అధికారిక ఆదేశాల వివరాలు బయటకు రాలేదు. కానీ.. చెల్లింపులు మాత్రం జరిగిపోతున్నాయంటున్నారు. ఈ మేరకు..మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. సాక్షి పత్రిక కు ఇచ్చే ప్రకటనల రేట్లు రెండు వందల శాతం పెంచడాన్ని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి.. సాక్షి పత్రిక నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయి. సహజంగానే సాక్షి పత్రికకు ప్రకటనల ఆదాయం తక్కువ. ఆ లోటును.. ఏపీ ఖజానా నుంచి భర్తీ చేసుకుంటున్నారు. ఏ చిన్న పథకం పెట్టినా… రూ. కోట్లు వెచ్చించి ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా ప్రకటనల బడ్జెట్లో సగం సాక్షికే పోతోంది. మిగిలిన సగం.. మాత్రం.. మిగతా పత్రికలకు ఇస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనల విరుద్ధంగా జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. సాక్షి పత్రికకు ఇస్తున్న ప్రకటనల రేట్లు కూడా పెంచడంతో.. మరింత ప్రజాధనం.. సాక్షి ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.