సాక్షి పత్రిక తగ్గిపోతున్న సర్క్యూలేషన్‌ను నిలబెట్టుకునేందుకు వినూత్న స్కీమ్‌లకు తెర తీస్తోంది. రూ. వెయ్యికే ఏడాది పాటు పత్రిక సరఫరా చేస్తామని స్కీమ్ ప్రవేశ పెట్టింది. అయితే ఇది నేరుగా ప్రకటిస్తే విలువ తగ్గిపోతుంది. ఎవరూ కొనడం లేదని ఇలాంటి స్కీమ్ పెడుతున్నారన్న ఆలోచనలు వస్తాయి కాబట్టి.. వ్యూహాత్మకంగా అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థలు.. కార్పొరేషన్లు.. ఇలా ముఖ్యమైన సంస్థల్లో పని చేసే వారికి.. చదువుకునే వారికి ప్రత్యేకంగా ఆఫర్ అమలు చేస్తున్నట్లుగా సర్క్యూలర్ పంపుతున్నారు.
ప్రభుత్వ అనుబంధ కాలేజీలు.. యూనివర్శిటీల్లో విద్యార్థులకు ఈ మేరకు ఆఫర్ వెళ్లింది. రూ. వెయ్యి చందా కట్టి.. అడ్రస్ చెబితే.. ఇంటికే పంపుతామని స్వయంగా ప్రిన్సిపల్స్ ఆఫర్ ప్రచారం చేస్తున్నారు. ఓ రకంగా వారు కొనాలనే ఒత్తిడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్ మెంట్, ఇతర పథకాలు పొందే వారు పేపర్ వేయించుకోకపోతే పథకాలు కట్ అనే ప్రచారం సహజంగానే జరుగుతుంది. వారి పేర్లు నోట్ చేసుకుంటారు. ఇక కార్పొరేషన్లలో ఉద్యోగులు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు తర్వాతి దశలో పేపర్ రూ. వెయ్యికే ఇచ్చే ప్లాన్ అమలు చేసే అవకాశం ఉంది.
ప్రింట్ మీడియా ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎవరికీ ఉదయమే పేపర్ చదివే తీరిక ఉండటం లేదు. ఎప్పటికప్పుడు వార్తలు సోషల్ మీడియా ద్వారా.. టీవీ ద్వారా తెలిసిపోతున్నాయి. ఈ కారణంగా సర్క్యూలేషన్ దారుణంగా పడిపోతోంది. సాక్షి లాంటి పత్రిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ కారణంగా అధికార బలంతో కొంతైనా.. సర్క్యూలేషన్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంత మేరకు సక్సెస్ అవుతుందో కానీ.. రూ. వెయ్యికే పేపర్ వేయడం వల్ల సాక్షికి వచ్చే నష్టం చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుత కేజీ వేస్ట్ పేపర్ కూడా.. రూ. నలభై.. యాభై పలుకుతోంది. ఈ లెక్కల సాక్షి పత్రికకు పెట్టే రూ. వెయ్యి.. ఆ పేపర్లను కిలోల లెక్కల అమ్ముకున్నా వచ్చేస్తుంది. అయితే అధికార దన్ను ఉంది కాబట్టి సాక్షి.. నష్టాలను ఏ విధంగానైనా భర్తీ చేసుకోగలదు.