తృతీయ వార్షికోత్సవం పేరిట బిజెపి అద్యక్షుడు కేంద్ర మంత్రులు దక్షిణాది మీడియా సంస్థలకు ఇచ్చిన విందుకు తెలుగు రాష్ట్రాల మీడియాధిపతులు కొందరే హాజరయ్యారు. కొందరిని వారే ఆహ్వానించలేదు. ఈ ఈవెంట్‌ను ఈనాడు వివరమైన వార్తగా ఇస్తే సాక్షి పెద్ద పోటోవార్త ప్రచురించింది. ఈ వార్తలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అమిత్ షా పక్కనే వుండటం ఆసక్తికరం. స్వతహాగా ఆయనకు ఢిల్లీ వర్గాలతో పరిచయం బిజెపి నేతలతో సాన్నిహిత్యం వున్నాయి. ఈనాడు ఈ వార్తను హైదరాబాదులో మాత్రమే ఇచ్చింది. సమాచారం కూడా తెలంగాణకు సంబంధించింది మాత్రమే. కాని సాక్షి మాత్రం వెంకయ్య నాయుడు మరికొందరితోసహా చాలా పెద్ద పోటోను ప్రత్యేకంగా ప్రచురించింది. ఇటీవలి వరకూ ఈయన పేరంటేనే వారికి కంటగింపుగా వుండేది గాని జగన్ ప్రధాని మోడీతో భేటీ కాగానే అంతా మారిపోయినట్టుంది. ఈనాడు తమకన్నా కెసిఆర్‌కే ఎక్కువ ప్రచారమిస్తున్నదనే అసంతృప్తి టిబిజెపిలో చాలా వుంది. అమిత్ షా పర్యటనకు కూడా తగినంత ప్రాధాన్యత నివ్వలేదంటారు వాళ్లు. ఈ నేపథ్యంలో ద్వితీయ స్థానంలో వున్న సాక్షి తమకు ప్రచారమిస్తే బావుంటుందన్న కోర్కె బిజెపిలో బలంగా వుంది. మామూలుగా వైసీపీ అనుకూల సమాచారమిచ్చే కొన్ని సైట్లు ఆ తరహా కథనాలు కూడా ఇచ్చాయి. ఎటూవైసీపీకి ఎపిలో తప్ప తెలంగాణలో పెద్ద పోటీ చేసే పరిస్థితి వుండదు. ఇక్కడ ప్రత్యక్షంగానూ పరోక్షంగానో బిజెపికి ఎక్కువ కవరేజి ఇస్తే నష్టం లేకపోగా లాభమే ఎక్కువ అన్న భావన వుంది. కాబట్టి రానున్న రోజుల్లో అదే జరిగితే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. రాజకీయాల్లో లాగే మీడియాలోనూ ఏదైనా సాధ్యమే కదా!