అదేంటీ… నిన్నటి వరకూ అలా రాశారు కదా, ఇదేంటీ… ఇవాళ్ల ఇలా రాస్తున్నారు… పాఠకులను ఇలాంటి గందరగోళానికి గురి చేస్తోంది ‘సాక్షి’ పత్రిక! నిన్నటి వరకూ ఆ పత్రిక అభిప్రాయమేంటీ… ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాకపోవడం దగ్గర్నుంచీ, విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోకపోవడానికి ఏకైక కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నలోపమనే కదా రాసుకుంటూ వచ్చారు. కేంద్రం నుంచి అడిగి తెచ్చుకోలేకపోయారనే కదా కథనాల్లో రాసేవారు. పాఠకులు కూడా దాదాపు అదే అభిప్రాయంతో ఉంటూ వచ్చారు. కానీ, ఇవాళ్ల హఠాత్తుగా… భాజపా కూడా ఆంధ్రాకి అన్యాయం చేసిందని గొంతు పెంచారు..! టీడీపీతో సమాన స్థాయిలో అన్యాయం చేసిందంటున్నారు. టీడీపీతో కుమ్మక్కై రాజకీయం చేస్తోందంటూ అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నారు.
టీడీపీ-భాజపా లాలూచీ రాజకీయం తేటతెల్లమైందనీ, పార్లమెంటులో మహాకుట్ర జరుగుతోందనీ, ఆ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయంటూ నేటి సాక్షి పత్రికలో కథనాలు వచ్చాయి. హస్తినలో హై డ్రామా అంటూ ఎడిటోరియల్ లో కూడా భాజపా, టీడీపీలకు సమాన స్థాయి కల్పించారు! గతంలో ఇలా లేదు కదా. గత సమావేశాల్లో 12 శాతం సభాకాలం మాత్రమే సజావుగా జరిగాయనీ, సమయం దుర్వినియోగం కావడానికి కారణం భాజపా అంటూ విమర్శించారు. ఏపీ ప్రజలకు భాజపా సంజాయిషీ చెప్పాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి అఖిల పక్ష సమావేశానికి వైకాపా ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను పిలవడంతోనే ఆ రెండు పార్టీల మధ్య లోపయికారీ ఒప్పందం కుదిరిందనడానికి సాక్ష్యం అన్నారు.
ఏతావాతా సాక్షి తాజా ఆవేదన ఏంటంటే… వైకాపా ఇచ్చిన అవిశ్వాసంపై మోడీ సర్కారు చర్చించలేదు, ఇప్పుడు టీడీపీ ఇస్తే చర్చకు సిద్ధమందీ అనేది! అయితే, ఇదే ఆవేదన నాడు.. అంటే, వైకాపా అవిశ్వాసం తీర్మాన నోటీసులు ఇచ్చిన గత సమావేశాల్లో సాక్షి ఎందుకు ఇంతగా వ్యక్తం చేయలేకపోయింది? 13 సార్లు నోటీసులు ఇచ్చినా అనుమతించని ఆ సందర్భంలో భాజపాపై ఎందుకు ఇంతగా విమర్శలు రాయలేకపోయింది? గత సమావేశాల్లో ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంటు ముందు మీడియాతో రోజూ మాట్లాడారే… అప్పుడు కేంద్రాన్ని ఎందుకు విమర్శించలేకపోయారు? అప్పుడు టీడీపీతో భాజపా కుమ్మక్కైందని ఎందుకు సాక్షి చెప్పలేకపోయింది..? ఎన్డీయేతో అధికారికంగా అన్ని రకాల బంధాలనూ తెంచుకున్న టీడీపీతో లోపయికారీ ఒప్పందం భాజపా ఎలా చేసుకుంటుందీ..? దాని వల్ల ఏం ఉపయోగం..? సొంతంగా ఏపీలో బలపడాలని చూస్తున్న భాజపాకి… టీడీపీతో లాలూచీ పడితే ఆత్మహత్యాసాదృశ్యం అని తెలీదా..? టీడీపీపై వ్యతిరేకతనే పెట్టుబడిగా పెడుతున్న భాజపాకి లాలూచీ లాభమా..? భాజపాతో లాలూచీ నిజమైతే టీడీపీకి పుట్టగతులుండవనేది అందరికీ తెలిసిందే కదా..! ఒకవేళ లాలూచీ పడే పరిస్థితి రెండు పార్టీల మధ్యా ఉంటే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి రావాల్సిన అవసరం ఏముంటుంది..? మంత్రి పదవుల్ని కాదనుకుని, కేంద్రంలోని అధికార పార్టీతో కయ్యానికి కాలు దువ్వాల్సిన పనేముంది..? ఇలా తన అభిమాన పాఠకులను ఇలా కన్ఫ్యూజ్ చేసేసింది నేటి సాక్షి పత్రిక.
గత పార్లమెంటు సమావేశాల్లో వైకాపా పెట్టిన అవిశ్వాస తీర్మానం చారిత్రకం అని సాక్షి చెప్పింది! మరి, ఇవాళ్ల టీడీపీ పెడుతున్నది లోపయికారీ రాజకీయం అంటోంది. వైకాపా అవిశ్వాసం పెడితే.. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమట, ఇవాళ్ల టీడీపీ పెడుతుంటే… ఇది కుట్ర రాజకీయమట..! ఎటోచ్చీ అర్థమౌతున్న విషయమేంటంటే… తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏం చెయ్యాలో అనే ఒక అర్థం కాని గందరగోళ స్థితి వైకాపాలో ఉందన్నది. నేటి సాక్షిలో కూడా అదే ప్రతిఫలించింది, అంతే!