ప్యారడైజ్ పేపర్ల ప్రకంపనలు ఏపి లో మొదలయ్యాయి. ప్యారడైజ్ పత్రాల్లో తన పేరు ఎందుకుందో వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి వెల్లడించాలని రాష్టమ్రంత్రులు డిమాండ్ చేశారు. పన్ను ఎగవేతదారు, ఆర్థిక నేరస్థుడు పాదయాత్ర చేయడం ప్రపంచ చరిత్రలో లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి అవినీతి చరిత్ర దేశ ఎల్లలు దాటి ప్రపంచం మొత్తం విస్తరించిందని, ఈ విషయం ప్యారడైజ్ ప్యాపర్స్ ద్వారా మరోసారి స్పష్టమైందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి విమర్శించారు. కథనాలపై తక్షణమే ఆయన వివరణ ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. అయితే దీనిపై సాక్షి కథనం వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది. జగన్ పేరు ప్యారడైజ్ పత్రాల్లో ఎక్కడా “నేరుగా” లేదని వివరించింది. సాక్షి వివరణ ఇదీ..
“ప్యారడైజ్ పత్రాల్ని ఐసీఐజే బయటపెట్టింది. ఐసీఐజేకు ఇండియాలో భాగస్వామి అయిన ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఈ వివరాలను ప్రచురించింది. నిజానికి ఈ పత్రాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన హెటెరో గ్రూపు ప్రమోటర్ల పేర్లున్నాయి. హెటెరో డ్రగ్స్ సంస్థ ‘హెటెరో మాల్టా’ పేరిట అక్కడో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. దాన్లో డైరెక్టర్లుగా హెటెరో ప్రమోటర్లు ఎ.నరసారెడ్డి, బి.పార్థసారథి రెడ్డి పేర్లున్నాయి. దీనిపై వారిద్దరూ వివరణ కూడా ఇచ్చారు. ఆ కంపెనీ ఉన్న మాట నిజమేనని, అది తమ వ్యక్తిగతం కాదని, హెటెరోకు అనుబంధ సంస్థ అని, యూరప్ కార్యకలాపాల కోసం ఆ కంపెనీని తమ సంస్థే ఏర్పాటు చేసిందని, ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌తో సహా వివిధ రెగ్యులేటరీ సంస్థలకు తెలియజేస్తూనే ఉన్నామని స్పష్టం చేసింది. ఈ వివరణను కూడా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ప్రచురించింది. వివిధ కేసులతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తుల పేర్లు ఈ రికార్డుల్లో ఉన్నాయని పేర్కొంటూ….వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పై సీబీఐ దాఖలు చేసిన కేసు..’’ అంటూ కేసుల్ని ఉదహరించింది. అదీ జగన్ పేరు ప్రస్తావనకు వచ్చిన తీరు. అసలు జగన్మోహన్రెడ్డిపై సీబీఐ కేసు… అంటే ఏంటి? ‘సాక్షి’లో హెటెరో పెట్టుబడులు పెట్టింది. దీనికి సంబంధించి హెటెరోపై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. అంటే..జగన్మోహన్రెడ్డి కేసుతో సంబంధం ఉన్న హెటెరో సంస్థకు బెర్ముడాలో కంపెనీ ఉన్నదనేది ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన వార్త తాత్పర్యం.”
మొత్తానికి జగన్ కేసు తో సంబంధం ఉన్న హెటెరో పై అభియోగాలే తప్ప జగన్ పై నేరుగా ఏ అభియోగాలూ లేవని, హెటెరో పై ఉన్నవి కూడా ఆరోపణలే తప్ప అవి నిర్ధారణ కాలేదని, అయినా విదేశాల్లో అకౌంట్స్ ఉన్నంత మాత్రాన నేరం కాదనీ, అవి అక్రమమా కాదా అన్నది తేల్చాల్సింది ఆయా దేశాల్లోని సంస్థలే అని సాక్షి ఉవాచ.