ప్రజాధనంతో సాక్షి పత్రికను కొనిపిస్తున్న వైనం సుప్రీంకోర్టుకు చేరింది. రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ . రెండు వందలు ఇచ్చి పత్రికను కొనాలని చెబుతోంది. అయితే ఇది నేరుగా సాక్షి పత్రికకే ఈ మొత్తం వెళ్తోంది. దీనిపై ఈనాడు దినపత్రిక సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సాక్షి పేపర్ని కొనిపించడం అధికార దుర్వినియోగం అని ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భగా వాలంటీర్లకు ఇస్తున్న సొమ్మంతా సాక్షి ఖాతాకే చేరుతోందని ఎలా చెబుతారని ఈనాడు యాజమాన్యం తరపున వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. కొన్ని ఆధారాలను లాయర్ కోర్టుకు సమర్పించారు. దీంతో సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు. తదుపరి విచారణ ఏప్రిల్ పదో తేదీకి వాయిదా వేశారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని సాక్షికి కట్టుబడెతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రకటనల పేరుతో వందల కోట్లు సాక్షి పత్రికకు వెచ్చిస్తున్నారు. అదే సమయంలో సాక్షిలో పని చేసిన కొన్ని వందల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ప్రభుత్వంలో చేరిపోయి ఏ పనీ చేయకుండానే లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు సాక్షి పత్రికను కూడా లక్షల సంఖ్యలో కొనిపిస్తున్నారు. అది కూడా ప్రజాధనం ఇచ్చే కొనిపిస్తున్నారు. వాలంటీర్లకు రూ. రెండు వందల చొప్పున ఇచ్చి రెండున్నర లక్షల సాక్షి కాపీల్ని కొనిపిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం కూడా ఇటీవల రెండు వందలు ఇచ్చేందుకు జీవో ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్కో చోట రెండు పేపర్లు వేస్తున్నారు. ఇలా కనీసం ఐదారు లక్షల కాపీసను ప్రతీ రోజూ ప్రజాధనంతో కొనుగోలు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇలా వందల కోట్ల ప్రజాధనాన్నిసాక్షికి కట్టబెడుతూండటంతో పాటు అత్యధిక సర్క్యూలేషన్ అని చెప్పుకునేందుకు ఇలా ప్రజా ధనమే దుర్వినియోగం చేస్తూండటంతో ఈనాడు పత్రిక హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే సాక్షి పత్రికే కొనాలని ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. దీంతో హైకోర్టు పిటిషన్ ను తిరస్కరించింది. కానీ నేరుగా ఆదేశాలివ్వకపోయినా .. ఆ డబ్బులన్నీ సాక్షికే వెళ్తున్నాయని ఆధారాలు సేకరించి ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.