పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను సిబ్బంది నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే, దీన్ని యథాతథంగా పాఠకులకు అందించలేని పరిస్థితిలో సాక్షి ఉంది! గిన్నీస్ రికార్డులను టీడీపీ ప్రభుత్వ నాటకంగా చూపించే ప్రయత్నమే చేసింది. పోలవరంలో పనుల్లో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి నాటకాలు ఆడిస్తున్నారంటూ ఒక కథనంలో పేర్కొంది. గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నించడం తప్పుకాదనీ, అయితే దీన్ని తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు వినియోగించడం సరికాదంటూ కొంతమంది అధికారులు అభిప్రాయపడుతున్నారట!
పోలవరం పనుల్లో దాదాపు 40 శాతం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగినవేననీ, ఆ సమయంలో భూసేకరణకు అడ్డుపడేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారనీ, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పోలవరం పనులు అడ్డుకునే కుట్ర చేశారని ఆరోపించారు. పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తి చేశారుగానీ… పోలవరం పూర్తయితే ఈ రెండూ వృథా అనీ, వీటిపై దాదాపు రూ. 3 వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారంటూ కథనంలో రాశారు. పోలవరం ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని అమాంతంగా పెంచేశారనీ, కమిషన్లకు కక్కూర్తి పడ్డారనీ, అలా కమీషన్లకు ఆశించకుండా పట్టిసీమ, పురుషోత్తపురం ఎత్తిపోతలకు పెట్టిన ఖర్చును పోలవరం ప్రాజెక్టుకు పెట్టి ఉంటే.. ఈ పాటికే గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉండేదని సాక్షి చెప్పింది. పోలవరం పనుల సమీక్ష పేరుతో ఎప్పటికప్పుడు ఏదో ఒక డ్రామాను ముఖ్యమంత్రి చేస్తున్నారనీ, సీఎంకి చిత్తశుద్ధి ఉంటే కీలకమైన డిజైన్లను కేంద్ర జలవనరుల శాఖ ఎందుకు ఆమోదించదని రాశారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించకపోవడాన్ని కూడా ఎంతో చక్కగా సాక్షి వెనకేసుకొస్తోంది. ఈ కథనం మొత్తంలో కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించిగానీ, రాష్ట్రానికి చెల్లించాల్సిన బిల్లుల్లో జాప్యం గురించిగానీ, డీపీఆర్ ఎందుకు ఫైనలైజ్ చేయడంలో దాని ప్రస్థావనగానీ.. ఇవేవీ లేవు. ఎంతసేపూ కమిషన్లు తినేశారు, అవినీతి జరిగిపోయిందన్న దుష్ప్రచారమే తప్ప. అలాంటి ఏదైనా జరిగి ఉంటే టీడీపీ సర్కారుపై గుర్రుగా కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగేసి ఈపాటికే నానాయాగీ చేసేది కదా! పోలవరం ప్రాజెక్టు పనుల జాప్యానికి కేంద్రం వైఖరే కారణం అనేది అందరికీ తెలిసిందే. ఆ అసలు విషయాన్ని సాక్షి ఎప్పుడూ ప్రశ్నించదు. వైకాపా భాజపాని నిలదీయదు. ఈ జాతీయ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రస్థాయిని దాటి సాక్షి ఎన్నడూ ఆలోచించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను, సాధించిన విజయాలను మెచ్చుకోలేని పరిస్థితి..!