మళ్ళీ వెండితెరపై మెరుస్తున్న ‘సాక్షి’ రామ్ అన్నయ్య
హైదరాబాద్: సాక్షి పేపర్ చదివేవారందరికీ రామ్ అన్నయ్య అలియాస్ ప్రియదర్శిని రామ్, అలియాస్ రామిరెడ్డి గురించి తెలిసే ఉంటుంది. సాక్షి పేపర్లో రామ్, ‘ఎగోనీ ఆంటీ’ లాగా ‘లవ్ డాక్టర్’ అనే కాలమ్ నిర్వహిస్తుంటారు. రామ్ అన్నయ్యా అంటూ పాఠకులు అడిగే వ్యక్తిగత సమస్యలకు దానిలో ఉచితంగా సలహాలిస్తుంటారు. తను కూడా ఎదుటివారినందరినీ అన్నయ్యా అని సంబోధిస్తుంటారు. సాక్షి పేపర్, టీవీ విభాగాలలో ఆయన కీలక పాత్ర పోషిస్తుంటారు. తన డీప్ బేస్ వాయిస్‌ను అప్పుడప్పుడూ కొన్ని ప్రత్యేక కథనాలకు వాయిస్ ఓవర్‌గా వాడుతుంటారు… యాంకర్‌గా వార్తలు చదువుతుంటారు… ఆయన చేయని పనంటూ లేదు. ఆ మధ్య కొన్నాళ్ళు సాక్షినుంచి బయటకు వెళ్ళినప్పటికీ మళ్ళీ కొద్దికాలంక్రితం తిరిగి చేరారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి గెలిచినపుడు – రామ్ తన వ్యూహాలు, తెలివితేటలతో ఒంటి చేత్తో వైఎస్‌ను గెలిపించాడంటూ రామ్ సోదరుడు రాసిన ఒక ఆర్టికల్, సాక్షికి అతను కొంతకాలం దూరమవటానికి దారి తీసిందని చెబుతుంటారు. గతంలో ప్రియదర్శిని పేరిట ఒక ఎడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీకూడా నడిపారు. సరే ప్రస్తుతానికొస్తే రామ్ అన్నయ్య నిన్న విడుదలైన ‘బెంగాల్ టైగర్’ సినిమాలో తళుక్కుమంటూ మెరిశారు. దీనికి పెద్ద బ్యాక్‌గ్రౌండే ఉంది.
2006లో విడుదలైన ‘మనోడు’ సినిమాకు, ఉపేంద్ర, రాజా, కామ్నా జెఠ్మలాని ప్రధాన పాత్రధారులుగా 2007లో విడుదలైన ‘టాస్’ సినిమాకు ప్రియదర్శిని రామ్ దర్శకుడు. దర్శకత్వంతో పాటు ఆ చిత్రాలలో కీలక పాత్రలను కూడా రామ్ పోషించారు. అట్టర్ ఫ్లాప్ అయిన ఆ సినిమాలలో టాస్ సినిమాకు సంపత్ నంది మాటల రచయితగా పనిచేశారు. ఆ కృతజ్ఞతతో రామ్‌కు సంపత్ తన తాజా చిత్రంలో అవకాశం ఇచ్చారు. రామ్ ఇటీవల సినిమాలలోకి పూర్తిస్థాయిలో నటుడిగా దిగటానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లున్నారు. ఇటీవల విడుదలైన పూరి జగన్నాథ్ చిత్రం జ్యోతిలక్ష్మిలో కూడా ఒక పోలీసాఫీసర్ పాత్రను పోషించారు. బెంగాల్ టైగర్ చిత్రంలో కూడా అదే రకం పాత్రలో నటించారు. అంటే రామ్ అన్నయ్యను మనం మరింత తరచుగా సినిమాలలో చూడబోతున్నామన్నమాట!