‘ఆరేళ్ల చిన్నారిపై టీడీపీ కార్యకర్త అత్యాచారం’.. ఇదీ ఈ రోజు సాక్షి దినపత్రికలో కనిపించిన ఒక వార్త! కర్నూలు జిల్లాలో ఒక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై వర్కూరు గ్రామంలో ఒక పెద్దాయన అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యుడు కొడుమూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అత్యాచారం చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్త అని, తమ ప్రభుత్వం అధికారంలో ఉందనీ, దీని గురించి ఎవరికైనా చెబితే జాగ్రత్త అంటూ బెదిరించినట్టు ఆ వార్తలో రాశారు.
అత్యాచార ఘటనలకు కూడా రాజకీయ కోణాల ఆపాదింపు ఏ స్థాయికి దిగజారిందో దాచేపల్లిలో చోటు చేసుకున్న పరిణామాలను చూసి వారమైనా కాలేదు. సుబ్బయ్య టీడీపీ కార్యకర్తేననీ, లేదూ.. వారి బంధువులంతా వైకాపాలోనే ఉన్నారంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోసుకున్న వైనం చూశాం. అత్యాచార కేసుల విషయంలో కూడా వీరికి సానుభూతి ఉండదా, ఇక్కడా రాజకీయ ప్రయోజనాలేనా అంటూ సామాన్యులు మండిపడ్డారు. ఇంత జరిగాక కూడా.. ఇప్పుడు సాక్షి పత్రిక ‘టీడీపీ కార్యకర్త అత్యాచారం’ అంటూ వార్త రాసింది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నవారంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారే అనే వాదనను వైకాపా తెరమీదికి తీసుకొచ్చింది. కాబట్టి, ఇకపై ఏ అత్యాచారం ఘటన జరిగినా, పార్టీ సభ్యత్వ రసీదులు, అధికార పార్టీ నుంచి పొందిన ప్రయోజనాలు, సదరు నిందితుడు ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలను వినియోగించుకున్నాడా లేదా అనేవి వెలికి తీసే ప్రయత్నంలో ఆ పార్టీ పత్రిక ఉన్నట్టుంది.
అత్యాచారం మాత్రమే కాదు… దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసినవాళ్లు కూడా ఏదో ఒక పార్టీకి చెందినవారే అయ్యుంటారు కదా! అంటే, అలాంటి వారి వికారపు చేష్ఠలను ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రేరేపిత చర్యగానే సాక్షి చూస్తుందేమో..? కేంద్రం అందరికీ ఆధార్ కార్డులు ఇచ్చింది కదా, ఆ లెక్కన ఆధార్ ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి పని చేస్తే.. అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రేరేపించిన దుశ్చర్యగా ఇకపై మాట్లాడుకోవాలా.? బాధ్యతగల మీడియాగా ఇలాంటి కథనాలు రాసేటప్పుడు.. రాజకీయ కోణాలను పక్కనపెట్టి, మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కనీసం ఇలాంటి దారుణమైన సంఘటన కథనాల్లో రాజకీయ కోణాలు తగ్గించాలి. ‘నిందితుడు టీడీపీకి చెందివాడని బాధితులు చెప్పారు కాబట్టి రాశాం’ అని వాదించొచ్చు. వైకాపా కార్యకర్త అని చెప్పినా కూడా రాసే ధైర్యం సాక్షి ఉందని వారు వాదించొచ్చు. కానీ, ఇలాంటి కథనాల్లో రాజకీయ పార్టీల ప్రస్థావనను సంస్కరించాల్సిన బాధ్యత పత్రికకు ఉండాలి కదా!