ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా కడప జిల్లాకు చెందిన ఆర్ఎం బాషా నియామకం ఖరారైంది. మంగళవారం శాసనసభ వాయిదా పడిన తరువాత సిఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంపిక కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన ఇటీవలి వరకూ సాక్షిలో పని చేశారు. ఆయనకు పొడిగింపు ఇవ్వకుండా ఏకంగా సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఇంతకు ముందు కూడా ఈ పదవి కడప జిల్లాకు చెందిన రమేష్ కుమార్ అనే బెంగాల్ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్‌కు ఇచ్చారు. ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో సాక్షి కోటాకు మార్చారు.
మరో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా గుంటూరు జిల్లాకు చెందిన పా పత్తిపాటి శామ్యూల్ జొనాధన్ను ఎంపిక చేశారు. ఆయన హిందూ పత్రికలో ఇప్పటికీ జర్నలిస్టుగా పని చేస్తూంటారు. పేరుకు జర్నలిస్టే కానీ సోషల్ మీడియాలో ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా విపరీతంగా ప్రచారం చేస్తూంటారు. దానికి ప్రతిఫలం దక్కించుకున్నారు. ఎంపిక కమిటీ సిఫార్సులకు గవర్నర్ ఆమోదముద్ర పడాల్సిఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ మేరకు తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి.
సమాచార హక్కు చట్టాన్ని చాలా ఉన్నతమైన ఆశయంతో ఏర్పాటు చేశారు. కానీ అది రాజకీయ నియామకాలు అయిపోయాయి. గవర్నర్లు కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో.. పునరావాస కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు కోరుకున్న సమాచారం అందడం లేదు. సమాచార హక్కు చట్టం పనితీరు నానాటికి తీసికట్టుగా మారుతూండటమే దీనికి కారణం.