చినబాబు చిరుతిండి అనే తప్పుడు కథనం రాసిన సాక్షిపై లోకేష్ చేస్తున్న న్యాయపోరాటం చివరి దశకు చేరింది. ఈ కేసులో కోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఈ విచారణకు లోకేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఆయన కోర్టుకు వచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ లో పాల్గొన్నారు. సాక్షి తరపున ఐదుగురు లాయర్లు వాదిస్తున్నారు. సాక్షి చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా లోకేష్ కోర్టు ముందు ఉంటారు. ఇతరులు తప్పుడు సమాచారం వేశారని క్షమాపణలు చెప్పారు. కానీ సాక్షి మాత్రం … చిన్న సవరణ కూడా వేయలేదు. దీంతో లోకేష్ రూ. 75 కోట్లకు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.
లోకేష్‌పై ఓ ఉద్యమంలా వైసీపీ తప్పుడు ప్రచారం చేసేది. ప్రతీ దాన్ని లోకేష్ కు ముడి పెట్టేది. వీఐపీలు వచ్చినప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ ప్రకారం చేసే మర్యాదలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం విడుదల చేసింది. అదంతా లోకేష్ ఖర్చేనని సాక్షి రాసింది. నిజానికి ఆ సమయంలో నారా లోకేష్ అసలు విశాఖకు వెళ్లలేదు. ఆయన పేరు మీద ఖర్చు చేయలేదు. పైగా ఎప్పుడు విశాఖ వెళ్లినా ఖర్చులు తన సొంతగానే పెట్టుకుంటారు లోకేష్. ఇలా సాక్షి అడ్డంగా దొరికిన తర్వాత ఎందుకు వదలాలని లోకేష్ గట్టిగా న్యాయపోరాటం చేస్తున్నారు.
నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి అయిన తర్వాత ఈ అంశంపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాక్షికి ఈ కేసులో మెరిట్ లేదని సులువుగానే అర్థమవుతుంది. వివరణ ప్రచురించాలని లోకేష్ కు సారీ చెప్పాలని అడిగినప్పటికీ చెప్పడానికి నిరాకరించింది కాబట్టి కేసు కోర్టు వరకూ వెళ్లింది. ఇప్పుడు సారీ చెప్పినా.. జరిమానా కూడా విధించడం ఖాయంగా కనిపిస్తోంది.