ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి, విపక్షాలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందనీ, మోడీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈవీఎంల పనితీరుపై కూడా నమ్మకం పోతోందనీ, ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలను ఇతర పార్టీలకు వివరించారు. ఈవీఎంలు టేంపరింగ్ కి అవకాశం ఉందనేది సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేశారు. అయితే, ఇదంతా ఓటమికి చంద్రబాబు నాయుడు వెతుక్కుంటున్న సాకులుగానే వైకాపా పత్రిక సాక్షి చూస్తోంది. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రజలు ఎన్ని ఇబ్బందుపడ్డారనేది వారికి అవసరం లేని వ్యవహారం! ఈవీఎంలలో అవకతవకలకు ఆస్కారం ఉందనేది వారికి అర్థంకాని వ్యవహారం!
అసెంబ్లీ ఓటమిని ముందే గ్రహించి, ఢిల్లీ వేదికగా సాకును వేరే అంశాలపై నెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారని సాక్షి రాసింది. అంతేకాదు, ఢిల్లీ వేదికగా ఆయన చేసిన ప్రయత్నం విఫలమైందనీ, విపక్షాలేవీ ఆయన నిర్వహించిన సమావేశానికి రాలేదని పేర్కొంది. ఎన్నికల సంఘాన్ని కలిసి, 18 పేజీల్లో గోడు వెళ్లగక్కుకున్నారని వ్యాఖ్యానించింది. ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ కి 22 పార్టీలవారు వస్తారనుకుంటే, కేవలం 6 పార్టీల ప్రతినిధులు మాత్రమే వచ్చారనీ, ఇదంతా ఫ్లాప్ అని రాశారు. ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఐదు బూతుల్లో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీం కోర్టు చెప్పినా కూడా… చంద్రబాబు బేలెట్ పేపర్ మీద ఎన్నికలు పెట్టాలని పట్టుబడుతున్నారని ఎద్దేవ చేసింది.
సుప్రీం కోర్టు చెప్పిందేంటీ, విపక్షాలు డిమాండ్ చేస్తోంది ఏంటనే స్పష్టత సాక్షికి లేదు. ఒక నియోజక వర్గంలో 5 బూతుల్లోని 50 శాతం స్లిప్పులు లెక్కిస్తే చాలనేది కోర్టు చెప్పింది. అలాకాదు, మొత్తంగా అన్ని బూతుల్లోని 50 శాతం స్లిప్పులను లెక్కించాలనేది విపక్షాల డిమాండ్. ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయి కాబట్టి, ప్రతీ మెషీన్ లో ఓట్లతోపాటు, 50 శాతం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి… 22 పార్టీలు కలిసొస్తాయనుకుంటే ఆరు పార్టీలవారే వచ్చారనీ, చంద్రబాబు గోడును ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదన్నట్టు రాశారు. ఈ పార్టీలన్నీ కలిసి సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్నాయి, త్వరలో రివ్యూ పిటీషన్ కి వెళ్తున్నాయి. అంటే, కలిసికట్టుగా ఉన్నట్టే కదా! ఈ మొత్తం వ్యవహారాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి చంద్రబాబు వెతుక్కుంటున్న సాకుగా మాత్రమే వైకాపా చూస్తోంది. అంతేగానీ, ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియపై వస్తున్న అనుమానాలకు, అవకతవకలకు ఆస్కారం ఉన్న పెడధోరణులకు చెక్ పెట్టే ప్రయత్నంగా చూడలేకపోతోంది. ప్రతీ అంశాన్నీ రాజకీయ కోణంలో చూసి బుదర చల్లడమే తప్ప, ఆ పరిధి దాటి కాస్త విశాలదృక్పథం అలవరుచుకుంటే ప్రజా ప్రయోజనాలు ఏంటనేది అర్థమౌతుంది.