ప్రజాధనాన్ని సొంత కంపెనీలకు దర్జాగా మళ్లించుకుంటున్న వైనం ఏపీలో అందర్నీ నివ్వెర పరుస్తోంది. పత్రికలకు ప్రకటనల పేరుతో ఇప్పటికే వందల కోట్లు మళ్లిస్తున్నారు. ఇప్పుడు ఆ పత్రికను ఎవరూ కొనడం లేదని… సర్క్యూలేషన్ దారుణంగా పడిపోవడంతో పాటు… ఈనాడు కన్నా ఎక్కువ కాపీలు అమ్ముతున్నామని చెప్పుకునేందుకు ప్రజాధనంతోనే పేపర్లు కొనిపిస్తున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో సాక్షి పేపర్లు ఉన్నాయి. వాలంటీర్లకూ కొనేందుకు డబ్బులిస్తున్నారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా సాక్షి పత్రిక కొనేందుకు నెలకు రూ. రెండు వందలు ఇవ్వాలని నిర్ణయించారు.
నేరుగా సాక్షి పత్రిక అని ఉత్తర్వుల్లో చెప్పకుండా ప్రముఖ పత్రిక అంటున్నారు. ఈ స్వేచ్చ ఎవరికీ లేదు. అందరి ఇళ్లలోనూ సాక్షి ఏజెంట్ వచ్చి పత్రిక వేస్తున్నారు. అవసరం లేదనే పరిస్థితి లేదు. తాము గ్రామ, వార్డు సచివాలయాల్లో అదే చదువుతున్నామని.. ఇంటికెందుకని అడిగితే తర్వాత ఏమవుతుందో తెలుసు. అందుకే వారు దేనికోదానికి పనికి వస్తుందని ఊరుకుంటున్నారు. ఒక్కో గ్రామ వార్డు సచివాలయాలకు రెండు పేపర్లు వేస్తున్నారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు పేపర్ ఇస్తున్నారు. ఇప్పుడు లక్షన్నర మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్నారు. ఇదంతా ప్రజా ధనమే. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులు.. యూనివర్శిటీలకు బలవంతంగా అంటగడుతున్నారు. ఎలా చూసినా ఐదు లక్షల సాక్షి కాపీలను రోజుకు ప్రజా ధనంతో కొంటున్నారు.
ఇందు కోసం ప్రత్యేకంగా ఖాతాలు తెరిచి రూ. పది కోట్లను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రజాధనాన్ని ఇలా సొంత ఖాతాలకు మళ్లించుకోవడానికి పాలకులు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ప్రజలు ఓటేశారు కాబట్టి.. ఖజనాను దోచుకోవడానికి అనుమతి ఇచ్చారన్నట్లుగా వారి తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం ఇలా బరి తెగించడానికి కారణం … ఈనాడు కన్నా తమకు ఎక్కువ సర్క్యూలేషన్ ఉందని చెప్పుకోవడానికి కూడా ఓ కారణం అని అంటున్నారు. పేపర్ సర్క్యూలేషన్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ ఆడిట్ చేస్తుది. ప్రభుత్వం ఇలాంటి బలవంతంగా అంటగడుతున్న పత్రికల సేల్స్ ను కూడా అమ్మకాలుగా పరిగణించేలా సాక్షి యాజమాన్యం ప్రయత్నిస్తోంది. దీనిపై ఈనాడు హైకోర్టుకు వెళ్లింది. కానీ అక్కడ తాము సాక్షి కొనాలని చెప్పలేదని ప్రభుత్వం వాదించింది. హైకోర్టు కూడా పట్టించుకోలేదు. అసలు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎవరికి చేరాయి.. ఏ పత్రికకు చేరాయన్నది వివరాలు తీసుకుంటే మొత్తం బయటపడుతుంది. అక్కడి దాకా రానీయకుండా ప్రభుత్వం .. అధికారులు కలిసి నాటకాలు ఆడుతున్నారు. ప్రభుత్వం మారితే.. ఇలాంటి స్కాముల ద్వారా సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయడానికి అవసరమైన సాక్ష్యాలు కల్పిస్తున్నారన్న వాదన కూడా విపక్షల్లో వినిపిస్తోంది.