“సాక్షి” పై జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంచనాలు వేసుకున్నారు. కానీ ఆ ఆశలు, అంచనాలను.. సాక్షి ఎప్పుడూ అందుకోలేకపోతోంది. ప్రభుత్వంపై పోరాటం విషయంలో ప్రతిపక్ష నేతగా తాను చేస్తున్న దానికి సాక్షి పత్రిక వీలైనంత సాయం చేస్తుందేమో అని ఆయన ఆశ పడుతూ ఉంటారు కానీ.. ఎప్పటికప్పుడు.. నిరాశకు గురవుతూనే ఉన్నారు. చివరికి ఓ సందర్భంలో… “సాక్షి పత్రికలో ఏదో రాస్తే నాకేంటి సంబంధం” అని కూడా వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా సీనియర్ జర్నలిస్టుల్ని తీసుకొచ్చి… పెడుతున్నా.. తను ఆశిస్తున్న ప్రమాణాలు మాత్రం అందుకోలేకపోతోంది. చివరికి సొంత పార్టీ కార్యకర్తలు, నేతల్ని కూడా.. నమ్మించేలా.. లాజికల్ స్టోరీలు సిద్దం చేయలేకపోతున్నారు.
సొంత బేస్‌ను కూడా ఆకర్షించలేకపోతూండటం… ఎలాంటి రాజకీయ బాదరబందీ లేని తెలంగాణలో సైతం..నిష్పక్షిపాతంగా వ్యవహరించలేకపోవడంతో.. సర్క్యులేషన్ రోజు రోజుకు పడిపోతోంది. ఫీల్డ్ లో ఉన్న మండల స్థాయి జర్నలిస్టులకు మార్కెటింగ్ బాధ్యత ఇచ్చి కాపీల్ని పెంచేలా ఒత్తిడి చేసినా.. దాని ఫలితం అంతంతమాత్రంగానే ఉంటోంది. దాంతో ఎన్నికల ముందు సమూల మార్పులు చేయాలన్న ఆలోచనకు జగన్ వచ్చినట్లు చెబుతున్నారు. ఎడిటోరియల్ డైరక్టర్‌గా రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత పత్రిక పరిస్థితి మరింత దిగజారిందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. జగన్ లో కూడా ఉంది. కానీ తాను స్వయంగా తీసుకొచ్చి పెట్టారు కాబట్టి.. ఇప్పటి వరకూ భరించారని అంటున్నారు. ఒక వేళ రామచంద్రమూర్తిని పక్కన పెడితే.. ఎవర్ని పెట్టాలన్న సంశయం కూడా చాలా రోజుల పాటు.. సాక్షి క్యాంప్‌ను.. వేధిస్తూ వస్తోంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో… ప్రశాంత్ కిషోర్ కూడా.. జగన్ మీడియా స్ట్రాటజీలో మార్పులు రావాలని సూచించారని.. దానికి తగ్గట్లుగా.. ఆయన ఓ సీనియర్ జర్నలిస్ట్ పేరును ఖరారు చేశారని అంటున్నారు. దానికి జగన్ కూడా.. ఓకే చేశారని.. రేపో మాపో ఎడిటోరియల్ డైరక్టర్‌గా కొత్త వ్యక్తి వస్తారని అంటున్నారు. అయితే ఆ జర్నలిస్ట్ ఎవరనేది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది. ప్రశాంత్ కిషోర్ సలహా కాబట్టి..ఆయన తెలుగువాడు కాదని…అంటున్నారు. దైనిక్ జాగరణ్ గ్రూప్ లో పని చేస్తున్న జర్నలిస్ట్ అని అంటున్నారు. మొత్తానికి ఉత్తరాది జర్నలిస్ట్.. మాత్రం.. సాక్షిలో కీలక పాత్రలోకి రావడం ఖాయమన్న ప్రచారం మాత్రం ఉద్యోగుల్లో జోరుగా సాగుతోంది.