ప్రతిపక్ష నాయకుడు జగన్, కేటీఆర్ భేటీ ప్రభావం రాజకీయంగా తమకు అనుకూలంగా మారేట్టు లేదనే ఆందోళన వైకాపా వర్గాల్లో ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం సాక్షి రంగంలోకి దిగింది..! ఈ క్రమంలో వాస్తవాలను వక్రీకరించి, గతానికీ భవిష్యత్తుకీ తేడాను మరచిపోయి, రాష్ట్ర ప్రయోజనాల కోణాన్ని వదిలేసి… ఓ కథనం నేటి పత్రికలో అచ్చు వేశారు. ‘పతనం అంచున గగ్గోలు’అంటూ రాసిన కథనంలో… జగన్, కేటీఆర్ భేటీని తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారనీ, ఎందుకు తప్పుబడుతున్నారు అంటూ పేర్కొన్నారు. ఆ భేటీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, మంత్రులు, మీడియాలో ఒక వర్గం వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. నిజానికి, ఈ కథనాన్ని పరిశీలిస్తే… వక్రీకరణ ఎవరిదో అర్థం కాకుండా ఉండదు.
తెరాసతో పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. నాలుగు నెలల కిందటే అప్పటి మంత్రి కేటీఆర్ తో మాట్లాడి తెరాసతో పొత్తుకి ప్రయత్నించారనీ, వారు కుదరదు అని చెప్పడంతో యూ టర్న్ తీసుకుని ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. వారు పొత్తుకు ప్రయత్నించిన సందర్భాన్ని రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కోణంలో చెప్పుకొచ్చారనీ, కానీ ఇప్పుడు వైకాపా ప్రయత్నిస్తుంటే విమర్శలు ఎందుకు చేస్తున్నారంటూ సాక్షి రాసింది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాన్ని గొప్పగా సాక్షి చెప్పింది. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకు రేపు అఖిలేష్ యాదవ్ రావొచ్చు, మయావతి, స్టాలిన్ లాంటివారు రావొచ్చని సాక్షి రాసింది. ఇలాంటి ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి, విమర్శలు చేస్తారా అంది.
ఇప్పుడు… సాక్షి మార్కు వక్రీకరణ దగ్గరకి వద్దాం..! తెరాసతో చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించిన మాట వాస్తవం. ఇప్పుడు కాదు… రాష్ట్ర విభజన తరువాతి నుంచీ కూడా తెలుగు రాష్ట్రాలు కలిసుంటేనే అందరి ప్రయోజనాలు నెరవేరుతాయనే భావజాలంతో ఆయన ఉన్నారు. దాన్లో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రయత్నించారు. అయితే… అప్పుడు తెరాస కాదంది. ఆ తరువాత తెరాస వైఖరి ఎలా మారింది… దీని గురించి సాక్షి ప్రస్థావించదు. ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఎలాంటి ప్రచారం చేసిందీ, కేసీఆర్ ఏపీని ఉద్దేశించి ఎన్ని విమర్శలు చేశారు.. ఇవేవీ సాక్షి ప్రస్థావించదు. చివరికి… ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామనీ, ముఖ్యమంత్రికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఛాలెంజ్ లు చేశారు.
తెరాస వైఖరిలో ఆంధ్రా ప్రయోజనాల కంటే… రాజకీయ కక్ష సాధింపు ధోరణి మాత్రమే ఉంది. చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించినప్పుడు రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కనిపించాయి. కానీ, ఇప్పుడు తెరాసతో జగన్ దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఆంధ్రాపై రాజకీయ కక్ష సాధింపు ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ తేడాను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ప్రజలు లేరన్నది సాక్షి అంచనా కావొచ్చు. ఇంకోటి… కేసీఆర్ చేస్తున్న మూడో ఫ్రెంట్ ప్రయత్నాన్ని గొప్పగా చెప్పింది సాక్షి. అఖిలేష్, మాయావతి, స్టాలిన్లు వచ్చేస్తారన్నట్టుగా రాశారు. కేసీఆర్ తో కలిసేందుకు కూడా అఖిలేష్ ఆసక్తి చూపని పరిస్థితిని సాక్షి వక్రీకరించేస్తే ఎలా..? జాతీయ రాజకీయాలు కేసీఆర్ కి కొత్త. ఇంకోపక్క చంద్రబాబు కూడా భాజపాకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని భంగపరచడమే కేసీఆర్ ధ్యేయం. ఈ భేటీ వెనక రాష్ట్ర ప్రయోజనాల కంటే… రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయన్నది ప్రజల్లోకి వెళ్లిన వాస్తవం.