పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ని సెర్బియాలో అరెస్టు చేసిన సందర్భంగా మన మీడియా ఎలా ప్రవర్తించిందో చూసాం. నిమ్మగడ్డ అరెస్టు సంబంధించిన వార్త ఎక్కడ కనీసం స్క్రోలింగ్ కూడా సాక్షి ఛానల్ ఇవ్వలేదు. సాక్షి పత్రిక అసలు ఆ వార్త తమకు తెలియదన్నట్లు గా కళ్లకు గంతలు కట్టుకుంది. టీవీ చానల్స్ లో అగ్రస్థానంలో ఉండే టీవీ9 కూడా తూతూ మంత్రంగా చిన్న వార్త ఇచ్చి వదిలేసింది. అయితే నిమ్మగడ్డకు సెర్బియాలో బెయిల్ దొరికి విడుదల కాగానే సాక్షి పత్రిక ఇవాల్టి ఎడిషన్ లో కథనాన్ని ప్రచురించింది. ఇంకొక హైలెట్ ఏమిటంటే, నిమ్మగడ్డ విడుదల వార్తను సైతం కేవలం తెలంగాణ ఎడిషన్, హైదరాబాద్ ఎడిషన్ లలో ప్రచురించి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో మాత్రం నిమ్మగడ్డ విడుదల వార్తను ఇప్పుడు కూడా ప్రచురించకపోవడం మరొక ఆశ్చర్యకరమైన విషయం.
రస్ ఆల్ ఖైమా ఫిర్యాదు మేరకు నిమ్మగడ్డ ప్రసాద్ ని సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ లో లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిమ్మగడ్డ ప్రసాద్ ని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం అయిన వాన్పిక్ ప్రాజెక్టు తో జగన్ అక్రమాస్తుల కేసు కు కూడా సంబంధం ఉండడంతో నిమ్మగడ్డ అరెస్టు కి సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తే అది జగన్ కేసు ల గురించిన చర్చకు దారి తీస్తుందన్న ఉద్దేశంతోనే సాక్షి ఈ వార్తలు ప్రచారం చేయలేదన్న అభిప్రాయం వినపడుతోంది. అదే విధంగా వైఎస్సార్ సీపీ ఎంపీలు అందరూ కలిసి ( ప్రత్యేక హోదా లాంటి సమస్యల మీద కాకుండా) నిమ్మగడ్డ ప్రసాద్ ని విడుదల చేయమని లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం పై కూడా సాక్షి వార్త ప్రచురించకపోవడం గమనార్హం.
ఏది ఏమైనా, నిమ్మగడ్డ అరెస్ట్ కు సంబంధించిన వార్తలను పూర్తిగా దాచేసి, ఇప్పుడు ఆయన బెయిల్ పై విడుదల అయితే, బెయిల్ పైన విడుదల అయినట్లుగా వ్రాయకుండా, నిమ్మగడ్డ విడుదల అని వ్రాయడం, సెర్బియా దేశం వదిలి వెళ్ళకూడదు అని ఆదేశించిన కోర్టు ఆదేశాలను సాక్షి ప్రస్తావించకపోవడం, అసలు ఈ మొత్తం వార్తను కూడా ఆంధ్ర ప్రదేశ్ ఎడిషన్లో ఇప్పుడు కూడా ఏ మాత్రం ప్రస్తావించకపోవడం చూస్తుంటే సాక్షి జర్నలిజం ఏ స్థాయిలో పార్టీ కరపత్రంగా మారిపోయిందా అన్న చర్చ జరుగుతుంది.