ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ఎందుకు జరుగుతోందో వైకాపా పత్రిక సాక్షి డీకోడ్ చేసింది! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ అజెండాతో మీటింగ్ పెడుతున్నారో కూడా సాక్షి చెప్పేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత, నీటి ఎద్దడి పరిస్థితులు, ఫొని తుఫాను, ఉపాధి హామీ… ఈ అంశాలపై అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఉందనేది ఏపీ సర్కారు అజెండా. ఇదే ప్రతిపాదనను ఈసీకి పంపి మంత్రి మండలి సమావేశానికి అనుమతులు కోరింది. అయితే, సాక్షి చెబుతున్నది ఏంటంటే… కేవలం ఉపాధి హామీ పనుల బిల్లుల కోసం మాత్రమే కేబినెట్ పెడుతున్నారట! ఆ బిల్లులపై ఆమోద ముద్ర పడిపోతే… టీడీపీ నేతలకు అందాల్సిన ముడుపులకు ఎలాంటి ఢోకా ఉండదనేది చంద్రబాబు వ్యూహమట!
గడచిన ఆరునెలల్లోనే దాదాపు రూ. 1920 కోట్ల పనికి ఆహారం పథకం బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసేసిందని సాక్షి చెప్పింది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారితే, ఈ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుందనీ, అందుకే వ్యూహాత్మకంగా ఈ కేబినెట్ మీటింగ్ ని చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి, ఈ పనికి ఆహారం పథకం బిల్లులు నేరుగా పంచాయతీలకు వెళ్తాయి. కానీ, గడచిన ఐదేళ్లుగా పంచాయతీల పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఈ బిల్లుల్లో వాటాలు దక్కించుకుంటున్నారని సాక్షి రాసింది. అదెలాగో స్పష్టంగా చెప్పలేదు. పంచాయతీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది కాబట్టి, అసెంబ్లీ ఫలితాల తరువాత ఆ ఎన్నికలు జరిగితే… సర్పంచులు మారితే… టీడీపీ బండారం బయటపడిపోతుందన్న ఆతృతతోనే ఈ కేబినెట్ లో పనికి ఆహారం పథకం బిల్లులను ఆమోదింపజేయాలని చంద్రబాబు చూస్తున్నారట.
నిజానికి, పనికి ఆహారం పథకం బిల్లుల చెల్లింపులు పంచాయతీల ద్వారా జరుగుతాయి. అంటే, నేరుగా పనిచేసిన వారికే సొమ్ము అందుతుంది. మధ్యలో నాయకుల ప్రమేయం లేకుండానే ఈ వ్యవస్థ ఉంది. అలాంటప్పుడు, సర్పంచులుగానీ ఇతర నేతలుగానీ మధ్యలో ఎలా జోక్యం చేసుకుంటారు? ఐదేళ్లుగా టీడీపీ నేతల దోపిడీ కొనసాగుతోందని రాసేశారే తప్ప… అదెలా జరుగుతోందో స్పష్టంగా చెప్పాల్సింది! ప్రభుత్వం మారితే బిల్లుల చెల్లింపు ఎందుకు ఆలస్యం అవుతుంది? పనిచేసిన కూలీలు ఊరుకుంటారా? ఇంకోటి… పెండింగ్ లో ఉన్న ఇతరల బిల్లులన్నీ టీడీపీ నేతల జేబులు నింపేవే అని టోకున ఆరోపించే ముందు… అదెలాగో కూడా వివరంగా రాస్తే అందరికీ స్పష్టంగా అర్థమౌతుంది కదా! ఈ కేబినెట్ మీటింగ్ లో కరువు పరిస్థితులకు ప్రాధాన్యత దక్కాలనిగానీ, నీటి ఎద్దడి పరిస్థితులపై ప్రభుత్వం ఆలోచించాలనే సూచనలుగానీ సలహాలుగానీ సాక్షి పత్రిక చెయ్యకపోవడం విశేషం. వారి దృష్టిలో కేబినెట్ భేటీ అంటే… సొంత బిల్లుల ఆమోదం కోసం టీడీపీ ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమంగానే కనిపిస్తోంది.