వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. ఆ పార్టీ గెజిట్ సాక్షి మీడియాకు.. ఇప్పుడు చంద్రబాబు ఫోబియా పట్టుకుంది. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు.. వారం రోజులుగా ప్రచారం చేస్తూండటం.. కూటమికి సానుకూల వాతావరణం ఏర్పడిందని పరిస్థితి రావడంతో… వైసీపీ వర్గాల్లో గుబులు ప్రారంభమయింది. ఒక వేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గెలిచేస్తే.. ఆ ప్రభావం జాతీయ రాజకీయాల్లో ఉంటుంది. కాంగ్రెస్ కూటమి బలంగా మారుతుంది. అదే జరిగితే.. వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు… మరో ఐదేళ్ల పాటు అధికారం కోసం.. పాదయాత్ర చేయాల్సి రావొచ్చు లేదా.. సీబీఐ కేసుల ధాటికి మరో లాలూలా అయిపోయినా ఆశ్చర్యం లేదు. అందుకే… చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో సక్సెస్ కాకూడదు.. ఒక వేళ అయినా.. అది ఆయన వల్ల కానే కాదని.. చెప్పడానికి.. రెండు వైపులా అర్థాలు వచ్చే కథనాలను సాక్షి రొజుకొకటి చొప్పన అచ్చేస్తోంది.
తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ నష్టపోయిందని.. కొద్ది రోజులుగా.. కథనాలు రాస్తున్న.. సాక్షి.. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ ప్రజానాడి హస్తం వైపు ఉందని చెప్పిన తర్వాతి రోజునే.. మరో భిన్నమైన కథనం రాసింది. “ఇంట గెలవలేకనే బాబు రచ్చ రచ్చ” అంటూ.. కొత్త కథనం రాసుకొచ్చింది. ఇందులో పూర్తిగా చంద్రబాబు ఏపీలో ఆదరణ కోల్పోయినట్లుగా.. రాసుకొచ్చారు. తన వైఫల్యాను ఎన్డీఏ మీద నెట్టేసి.. ఆయన తప్పించుకున్నట్లుగా విశ్లేషించారు. పనిలో పనిగా.. కూటమి అధికారంలోకి వస్తే.. చంద్రబాబే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారంటూ తెలంగాణ ప్రజల్లోకి ఓ భావన పంపే ప్రయత్నం చేశారు. అందుకే… దీన్ని తెలంగాణ ఎడిషన్లలోనూ ప్రముఖంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఇతర పార్టీ అధ్యక్షుడ్ని ఎలా వేలు పెట్టనిస్తారో సాక్షి పత్రికకే తెలియాలి..?
చంద్రబాబు రచ్చ గెలిస్తే.. ఇంట ప్రత్యర్థులుగా ఉన్న తాము ఎక్కడ బలైపోతామోనన్న భయం సాక్షి మీడియాలో కనిపిస్తోంది. అందుకే.. పెళ్లికి.. పిడుక్కి ఒకే మంత్రం అన్నట్లుగా.. కేసుల మాఫీ కోసం.. అవినీతిపై విచారణ జరగకుండా ఉండేందుకు .. కాంగ్రెస్తో వెళ్తున్నారని చెప్పుకొస్తున్నారు. నిజంగా అలా వెళ్తోంది.. వైసీపీ అధినేత జగనే కదా. బీజేపీ ఏపీకి అన్యాయం చేస్తున్నా.. ఆ పార్టీని పల్లెత్తు మాట అనకుండా.. సీబీఐ కేసుల్లో రిలీఫ్ పొందుతోంది జగనే కదా..! ఆ పార్టీకి ఎదురీది దాడుల్ని ఎదుర్కొని.. రాజకీయంగా సమరం చేస్తోంది టీడీపీనే కదా..! అధికారంలోకి వస్తుందో రాదో తెలియని కాంగ్రెస్తో జట్టుకట్టడం అంటే.. అధికార కేంద్రాన్ని డీకొట్టడమే కదా.! అయినా.. పాఠకుల్ని మభ్యపెట్టగలమనుకుని.. సాక్షి… ఒకే ఆరోపణలు..అటూ కాంగ్రెస్కు.. ఇటు టీడీపీకి కలిపి రాసేస్తోంది. జర్నలిజంలో కొత్త ప్రమాణాలు నిర్దేశిస్తోంది.