నూతన్ నాయుడు ఇంట్లో దళితులకు జరిగిన శిరోముండనం సంఘటన జనాలను నివ్వెరపరిచింది. సభ్యసమాజం హర్షించని ఇటువంటి సంఘటనల లో నిందితులకు కఠిన శిక్ష పడాలని అన్ని వర్గాల వారు కోరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో నూతన్ నాయుడు జనసేన కు చెందిన వాడని ఒక పక్క సాక్షి మీడియా, కాదు వైఎస్సార్సీపీకి చెందిన వాడేనని మరొక పక్క సోషల్ మీడియా వాగ్వివాదాలు చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ వార్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే
జనసేన వీరాభిమాని నూతన నాయుడు అంటూ మొదటి రాయి విసిరిన సాక్షి:
దళితుడికి శిరోముండనం జరిగిన సంఘటన ని నివేదించే టప్పుడు నూతన్ నాయుడు ని బిగ్ బాస్ కంటెస్టెంట్ అని కాకుండా జనసేన వీరాభిమాని అంటూ వార్తను ప్రజెంట్ చేయడం ద్వారా మొదటి రాయి సాక్షి విసిరినట్లు గా కనిపిస్తోంది. సాక్షి సోషల్ మీడియా అకౌంట్ ఈ ఈ వార్తను నివేదిక ఇస్తూ, “పెందుర్తి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని, పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన చోటు చేసుకుంది.” అని ప్రజెంట్ చేసింది.
పెందుర్తి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని, పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన చోటు చేసుకుంది.
— Sakshi TV (@SakshiHDTV) August 29, 2020
అదేవిధంగా సాక్షి ఛానల్ లో కీలక బాధ్యతలు పోషించే కొమ్మినేని శ్రీనివాసరావు కూడా, తన బ్లాగులో ఈ వార్తను ప్రజెంట్ చేస్తూ, జనసేన వీరాభిమాని నూతన్ నాయుడు ఇంట్లో సంఘటన అంటూ ప్రజెంట్ చేశారు.
నూతన్ నాయుడు వై ఎస్ ఆర్ సి పి విధి విధానాల రూపకర్త అంటూ వీడియో ఆధారాల తో తిప్పికొట్టిన జనసైనికులు:
సహజంగానే సాక్షి మీడియా, కొమ్మినేని ఈ వార్తను ప్రజెంట్ చేసిన తీరు జన సైనికులకు కోపం తెప్పించింది. జనసైనికులు గత రెండు మూడు రోజులలో ప్రభుత్వ ఆసుపత్రులకు 400కు పైగా ఆక్సిజన్ సిలిండర్లు తమ సొంత ఖర్చులతో అందించినప్పుడు ఆ వార్తని కవర్ చేయని సాక్షి మీడియా, ఇలాంటి సంఘటనలు జరిగినపుడు మాత్రం ఏదో విధంగా జనసేనకు ఆపాదించే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీ అభిమానులు మండిపడ్డారు. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి “జగనన్న రాజ్యంలో దళితులపై దాడులు” అని ఈ వార్తను నివేదించ వలసిందిగా సాక్షి’కి సూచించారు.
అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, నూతన్ నాయుడు వైఎస్ఆర్ సీపీకి చెందిన వ్యక్తే అంటూ వీడియో ఆధారాలతో మరికొందరు జనసైనికులు కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి నూతన్ నాయుడు వైఎస్ఆర్సిపి పార్టీ విధానాల రూపకల్పన చేసిన టీం లో ఒకరు. ఇప్పటికీ ఆయన ఫేస్ బుక్ పేజీలో ఆ విషయాన్ని ఆయనే సగర్వంగా ప్రకటించుకుంటూ ఉంటారు. ఆ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నూతన్ నాయుడు మాట్లాడుతూ – వైఎస్సార్సీపీ పార్టీ జెండా అజెండా విధివిధానాల రూపకల్పనకు తాను కృషి చేశానని, వైయస్సార్ కుటుంబ సభ్యులు తనను వచ్చి కోరినప్పుడు దానికి తాను ఒప్పుకున్నానని, పెద్దలు సోమయాజులు గారి ఆధ్వర్యంలో తమ టీం పని చేసామని, అయితే సోమయాజులు గారు వయసురీత్యా కేవలం గైడెన్స్ మాత్రమే ఇచ్చారని, వైయస్సార్సీపి పార్టీకి చెందిన విధివిధానాలు రూపొందించే మొత్తం క్రియ ప్రక్రియ తన ఆధ్వర్యంలోనే జరిగిందని, తాను వైఎస్ఆర్సిపి మనిషినే నని ఆయన స్వయంగా ప్రకటించుకున్న వీడియోని తెర మీదకు తీసుకువచ్చి సాక్షి మీడియా కి కౌంటర్ ఇచ్చారు జనసైనికులు.
ఘటన ను ఖండించిన జనసేన:
ఇదిలా ఉంటే జనసేన పార్టీ అధికారికంగా ఈ సంఘటనను ఖండించింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్ష విధించాలి అని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు జనసేన కు చెందిన వ్యక్తులు కాదని, అలా ఎవరైనా ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటన విడుదల చేసింది.