వివేకా హత్య కేసులో సాక్షి పత్రిక సీనియర్ పాత్రికేయలు అపరాధ పరిశోధన చేసి రోజుకో కుట్ర ధీయరీతో పత్రికల్లోకథనాలు రాస్తున్నారు. అందులో అవినాష్ రెడ్డి ఎంత అమాయకుడో అనే దగ్గర్నుంచి ఆయనను ఇరికించారని చెప్పుకోవడంతో పాటు అంతా చంద్రబాబు అమరావతి నుంచి కథ నడిపించారని చెప్పుకొస్తున్నారు. సరే వాళ్ల బాధ వాళ్లది అనుకున్నా…. నిజంగా కేసు సీబీఐకి ఇవ్వకపోయి ఉంటే .. ఈ కథలు.. కుట్రలు అన్నీ సిట్ చార్జిషీట్లుగా మారిపోయి అమాయకుల్ని బలి పెట్టేసి ఉండేవారు కదా అనేది ఎక్కువ మందికి వినిపిస్తున్నమాట.
లోకల్ ఎమ్మెల్సీని పెట్టేసి.. కేసు క్లోజ్ చేస్తున్నాం అని అప్పటి డీజీపీ గౌతం సవాంంగ్ చెప్పారని.. బీటెక్ రవి కూడా ఓ ఇంటర్యూలో చెప్పారు. అంటే.. అప్పటి డీజీపీ సమక్షంలోనే మొత్తం వివేకా హత్య కేసును ఎలా క్లోజ్ చేయాలో కూడా స్కెచ్ పూర్తి చేశారన్నమాట. అందు కోసం అప్పటికే అన్ని కుట్ర ధీయరీలు.. అలాగే ఫేక్ సాక్ష్యాలు రెడీ చేసుకుని ఉంటారు. సీబీఐకి ఇవ్వడంతో బతికిపోయారు కానీ లేకపోతే ఇప్పటికే వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డిని జైల్లో వేసి.. ఇలాంటి కథనాలను విస్తృతంగా వండి వార్చేసి వారే నిజంగా నేరం చేశారేమో అనిపించి ఉండేవారు. అంతే కానీ కళ్ల ముందు కనిపిస్తున్న వాటిని అబద్దం అని నమ్మించి ఉండేవారు.
సొంత కుటుంబసభ్యుడ్ని అత్యంత దారుణంగా చంపి.. సంబంధం లేని వారిపై తోసేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని కరుడు గట్టిన నేర మనస్థత్వం ఉన్న వారి చేతుల్లో ఇప్పుడు అధికారం ఉంది.. మీడియా ఉంది.. సోషల్ మీడియా ఉంది. .. అంత కంట తిమ్మిని బమ్మిని చేయడానికి వారికి కావాల్సిందేముంది…? జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే న్యాయపోరాటం చేసి.. సీబీఐ దర్యాప్తు తెచ్చుకుని ఇప్పుడు పోరాడుతున్న వారు బయటపడ్డారు కానీ.. లేకపోతే వారందరి గతి ఎలా ఉండేదో ఇప్పుడు సాక్షిలో కనిపిస్తున్న ” ప్రిపేర్డ్ చార్జిషీట్లే” సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఏదైనా తృటిలో తప్పించుకున్నారు.. వారు అదృష్టవంతులు.