ప్రభాస్ మూడ్ మొత్తం సినిమాలపైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్నటి వరకూ ‘కల్కి’తో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తరవాత ‘రాజాసాబ్’ కు కొన్ని డేట్లు ఇచ్చాడు. ఇప్పుడు ‘సలార్ 2’ మీద దృష్టి పెట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘సలార్’ సూపర్ హిట్టయ్యింది. పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కొంత మేర జరిగింది. మిగిలిన భాగాన్ని ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఈనెలాఖరు నుంచి ‘సలార్ 2’ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ కూడా సెట్లో అడుగు పెట్టబోతున్నాడు.
దాదాపు నెల రోజుల పాటు సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటనీ తెరకెక్కిస్తారని సమాచారం. ‘సలార్ 2’ షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ తో టాకీ మొత్తం ఓ కొలిక్కి వస్తుంది. ఈ యేడాది చివర్లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలోని సినిమా పట్టాలెక్కబోతోంది. అందుకే… ‘సలార్ 2’ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. డిసెంబరులో ‘సలార్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ‘సలార్’ని జపాన్‌లోనూ విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తెలుగు చిత్రాలకు ఈమధ్య జపాన్‌లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ జపాన్‌లో మంచి వసూళ్లు అందుకొంది. ఆ ప్రభావం ‘సలార్’పై తప్పకుండా ఉంటుందన్నది నిర్మాతల అంచనా.