రవి బస్రూర్.. సమకాలీన సినీ సంగీతంతో పరిచయం ఉన్నవాళ్లకు ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కేజీఎఫ్, సలార్ స్వరకర్తగా అందరికీ తెలిసిన మనిషే. ప్రస్తుతం టాప్ టెక్నీషియన్. సంగీత దర్శకుడిగా కోట్లు గడిస్తున్నాడు. పెద్ద హీరోలంతా రవి బస్రూర్‌నే తమ సినిమాలకు సంగీత దర్శకుడిగా ఎంచుకోవాలని ఆశ పడుతున్నారు. అయితే… రవి జీవితంలో ఎన్ని కష్టాలో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. ఇప్పుడింత పేరు, కీర్తి సంపాదించిన రవి.. కీ బోర్డు కోసం తన కిడ్నీల్ని అమ్ముకోవాలనుకొన్నాడంటే నమ్మగలమా? ట్రైన్ టికెట్ కి డబ్బులు లేకపోవడంతో… బాత్రూమ్లో దూరి, బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేశాడంటే.. ఆశ్చర్యపోకుండా ఉండగలమా?
రవి బస్రూర్ అసలు పేరు కిరణ్. కర్నాటకలోని బస్రూర్ అనే గ్రామంలో పుట్టాడు. యక్షగానాలు పాడుకొనే వంశం వాళ్లది. క్రమంగా.. యక్షగానాలకు ఆదరణ తగ్గడంతో కుటుంబమే ఓ సంగీత బృందంగా మారిపోయింది. మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించేది. అయితే… కుటుంబంలో కలహాల వల్ల, అంతా విడిపోయారు. సంగీత బృందం ముక్క చెక్కలయ్యింది. కిరణ్‌కి కమ్మరి పనిలో ప్రవేశం ఉండడంతో… అటు వైపు వెళ్లాడు. కానీ మనసంతా సంగీతంపైనే. కీ బోర్డు అద్దెకు తెచ్చుకొని సాధన చేసేవాడు. ఆపనీ ఈ పనీ చేసుకొంటూ పాతిక వేలు సంపాదించిన కీ బోర్డు కూడా కొన్నాడు. ముంబై వెళ్లి అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఈలోగా అంధేరీలోని ఓ పబ్బులో పాటలు పాడే ఛాన్స్ వచ్చింది. జీవనోపాధి కోసం అక్కడ పనికి కుదిరాడు. అయితే ఓరోజు తన సంగీత పరికరాలన్నీ ఓ బ్యాగులో వేసుకొని థానే లోని లోకల్ రైల్వే స్టేషన్ కి వచ్చాడు. సరిగ్గా అప్పుడే ఆ స్టేషన్‌పై ఉగ్రవాదులు కాల్పులకు ఎగబడ్డారు. పోలీస్ కమాండోలు రంగ ప్రవేశం చేశారు. కిరణ్ బ్యాగుతో సహా కనిపించడంతో.. అనుమానించిన కమాండోలు కమ్యునికేషన్ గ్యాప్ వల్ల.. ఆ బ్యాగ్ ని నేలకేసి కొట్టారు. దాంతో సంగీత పరికరాలన్నీ ధ్వంసం అయిపోయాయి. ఆ తరవాత కిరణ్ అమాయకుడని భావించి పోలీసులు వదిలేశారు. అప్పటికే పోలీసుల దెబ్బలకు స్పృహ కోల్పోయిన కిరణ్… అటు వైపు వచ్చిన ఆగిన ఓ ట్రైన్ ఎక్కేశాడు. కానీ టికెట్ కొనలేదు. టీసీ ఎకక్కడ వస్తాడో అని భయపడి, బాత్రూల్లోకి వెళ్లి దాక్కుని, బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేయాల్సివచ్చింది.
ఇంటికొస్తే అప్పుల బాధ. సంగీత పరికరాల కోసం డబ్బులు కావాలి. ఆ సమయంలో తన కిడ్నీ అమ్మడం తప్ప మరో మార్గం లేదని భావించి, ఓ బ్రోకర్ని కూడా సంప్రదించాడు. మొత్తం రెండున్నర లక్షలకు బేరం కుదిరింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఆసుపత్రిలో చేరాడు. ఇంకాసేపట్లో ఆపరేషన్ అనగా.. భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ దశలో రవి అనే ఓ స్నేహితుడు ఆదుకొన్నాడు. కీ బోర్డు కోసం 35 వేలు అప్పుగా ఇచ్చాడు. అక్కడి నుంచి తన సంగీత ప్రయాణం మళ్లీ ప్రారంభించాడు కిరణ్. ఆ దశలోనే ఎఫ్ ఎమ్ రేడియోలో జంగిల్స్ చేసే అవకాశం అందుకొన్నాడు. అలా అలా.. ప్రశాంత్ నీల్ కంట్లో పడ్డాడు. చివరికి ఉగ్రం సినిమాతో సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ పారితోషికం అందుకొని రవి దగ్గరకు వెళ్లాడు. కానీ రవి డబ్బులు తీసుకోలేదు. నీలానే ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయ్.. చాలు. అని సలహా ఇచ్చాడు. రవి తనకు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలీక కిరణ్ అనే తన పేరుని రవి బస్రూర్‌గా మార్చుకొన్నాడు. ఇదీ.. సలార్ స్వరకర్త దీన గాథ.