రెండు భాగాల ట్రెండ్ టాలీవుడ్ ని ఊపేస్తోంది. బాహుబలి రెండు భాగాలుగా వచ్చి, కోట్లు కుమ్మరించింది. కేజీఎఫ్ తొలి భాగం సూపర్ హిట్. చాప్టర్ 2 కోసం.. అంతా వెయిటింగ్. పుష్ష కూడా… పార్ట్ 1, పార్ట్ 2గా రాబోతోంది. ఇప్పుడు `సలార్`దీ ఇదే స్కీమ్ అన్నది టాలీవుడ్ వర్గాల గుసగుస.
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `సలార్`. కేజీఎఫ్ లానే .. సలార్ నీ రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది. ఈ విషయమై.. ప్రస్తుతం ప్రభాస్ – ప్రశాంత్ నీల్ మధ్య చర్చలు సాగుతున్నాయట. రెండు భాగాలుగా సినిమా విడుదల చేయడంలో చాలా సౌలభ్యాలున్నాయని, ముఖ్యంగా బిజినెస్‌పరంగా చూస్తే, భారీ లాభాలను ఆర్జించవచ్చన్నది ప్రశాంత్ నీల్ ఆలోచన. అది కేజీఎఫ్ లో వర్కవుట్ అయ్యింది కూడా. `సలార్`నీ అలానే డిజైన్ చేస్తే ఎలా ఉంటుందన్న విషయంలో ప్రస్తుతం హీరో, డైరెక్టర్ ఇద్దరూ తర్జన భర్జనలు పడుతున్నారని తెలుస్తోంది. నిజానికి `సలార్` ప్రారంభించే ముందు ఆ ఆలోచన లేదు. కానీ ప్రస్తుత మార్కెట్ స్ట్రాటజీని దృష్టిలో ఉంచుకుని, రెండు భాగాల ఆలోచన తట్టింది. అయితే రెండు భాగాలకు సరిపడినంత స్టఫ్ ఉందా, లేదా? తొలి భాగం విడుదలై తరవాత, రెండో భాగం షూటింగ్ మొదలెట్టాలా? లేదంటే రెండూ పూర్తి చేసి, అప్పుడు.. ఒకొక్కటిగా విడుదల చేయాలా? అనే విషయంపైనా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇది ఐడియా మాత్రమే. రెండో భాగానికి సరిపడ స్టఫ్ ఉంటే మాత్రం.. కేజీఎఫ్ ఫార్మెట్ లోనే.. సలార్ కూడా సాగబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూద్దాం.. ఏమవుతుందో?