కేజీఎఫ్‌లో ఓ కొత్త రకమైన హీరోయిజాన్ని చూపించాడు ప్రశాంత్ నీల్. ఆ ఎలివేషన్లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. యష్ అనే హీరో ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలియకపోయినా – ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారంటే – ప్రశాంత్ నీల్ ఎంతలా కనికట్టు చేశాడో అర్థం చేసుకోవొచ్చు. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నాడు అనగానే అందరి అంచనాలూ ఆకాశానికి తాకాయి. అప్పటి వరకూ ఎలాంటి ఇమేజ్ లేని, యష్నే ప్రశాంత్ నీల్ అలా చూపించాండంటే, ప్రభాస్ ని ఇంకే స్థాయిలో కూర్చోబెడతాడో అనుకొన్నారు. అందుకు సలార్ గురించి ఎప్పుడు చర్చకు వచ్చినా ఆసక్తి రేగింది. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ విషయంలో చిత్రబృందం మరీ పిసినారితనం ప్రదర్శిస్తూ వచ్చింది. ఫస్ట్ లుక్ వదలడానికే చాలా సమయం తీసుకొంది. ఎప్పుడు చిన్న స్టిల్ వదిలినా, అది మహాప్రసాదం అనుకొన్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పుడు టీజర్ వచ్చింది. బ్రహ్మముహూర్తం లెక్కలేసుకొని మరీ తెల్లవారుఝామున 5 గంటలకు ఈ టీజర్‌ని వదిలారు. అయినా ప్రభాస్ ఫ్యాన్స్ కాచుకొని కూర్చున్నారు.
తీరా చూస్తే టీజర్లోనూ ప్రశాంత్ నీల్ తన పాత స్టైల్ నే చూపించాడు. టీజర్లో ఎప్పటిలానే తన మార్క్ ఎలివేషన్ ఎంది. మీరు… జురాసిక్ పార్క్‌లో అడుగు పెట్టార్రా… అంటూ చెప్పే డైలాగ్ ప్రభాస్ స్టామినాకు సరిపోయేదే. అయితే.. కేజీఎఫ్‌లో ఎంత సేపూ ఎలివేషన్లతో కడుపు నింపేసిన ప్రశాంత్ నీల్ మళ్లీ అదే ఫార్ములా పట్టుకొన్నాడా అనిపించింది. కేజీఎఫ్‌లో బ్లాక్ కలర్ ధారాళంగా వాడేశాడు ప్రశాంత్ నీల్. ఇక్కడా అంతే. కేజీఎఫ్ షాట్లే మళ్లీ చూస్తున్నామా అన్నట్టు టీజర్ తయారైంది. కేజీఎఫ్ ఛాయలు టీజర్లోనే ఇన్ని కనిపించాయంటే..సినిమాలో ఇంకెన్ని ఉంటాయో అనిపిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఎలివేషన్లకు ముచ్చట పడిపోవొచ్చు. కాకపోతే ఓవరాల్ గా ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎలా తీసుంటాడా? అనే డౌటు ఇప్పుడు సాధారణ సినీ అభిమానుల్లో రేగుతోంది. సెప్టెంబరు 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించడం కొత్త ముచ్చట. దానికి తోడు ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నారని సైతం అధికారికంగా ధృవీకరించేశారు.