డిసెంబర్లో ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు 22వ తేదీ వరకూ జీతాలు , పెన్షన్లు చెల్లించారు. అతి కష్టం మీద ఆ చెల్లింపులు జరిగాయి. జనవరిలోనూ అదే పరిస్థితి. ఇప్పటికి పదో తేదీ వచ్చింది. ఇంకా జీతాల బిల్లులు పదిహేను వందల కోట్ల వరకూ పెండింగ్ ఉంది. అది కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి చెల్లించినవి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు రూ. ఇరవై ఒక్క కోట్ల వరకూ రుణాలిస్తే గట్టెక్కుతామని సీఎం జగన్ వెళ్లి మోదీకి మొరపెట్టుకున్నారు. అయితే కేంద్రం నాలుగు వేల కోట్లకు కొద్దిగా ఎక్కువ మాత్రమే అప్పునకు పర్మిషన్ ఇచ్చింది.
ఈ మంగళవారం రెండు వేల కోట్లు అప్పు తీసుకుంటున్నారు. తర్వాత మరోసారి ఇలా అప్పు తీసుకుంటే లిమిట్ పూర్తయిపోతుంది. అది కూడా ఈ నెలలోనే అయిపోతుంది. మరి ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎలాంటి అప్పులకూ అవకాశం లేదు. కేంద్రాన్ని ఎంత బతిమాలుకున్నా… వేల కోట్లలో అప్పులు రావడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. అంటే.. అప్పులు కూడా రాకపోతే.. జీతాలు ఇవ్వడం అసాధ్యంగా మారుతుంది. రోజువారీగా వసూలయ్యే మద్యం ఆదాయం.. పన్నుల ఆదాయాన్ని ఉద్యోగుల జీతాలకు సర్దుబాటు చేయాలి. అలా చేయాలంటే.. నెలంతా సరిపోతుంది.
ఇప్పటికీ కొంత మంది ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అదే వచ్చే రెండు నెలలు వారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉండబోతోందని తెలుస్తోంది. దీనికి వారు మానసికంగా రెడీ కావాల్సి ఉంది. ఏప్రిల్ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్రం కొత్త అప్పులకు అనుమతి ఇస్తుంది. అప్పుడు మరో మూడు నాలుగు నెలలు మాత్రం ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత మళ్లీ మామూలే.