ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల పెన్షన్లు అత్యధిక మందికిరాలేదు. కొంత మంది జీతాలూ పెండింగ్లో ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆసరా పథకం కింద రూ. 6400 కోట్లు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు మీట నొక్కే కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహిస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత కొత్త అప్పులు తీసుకునేందుకు అవకాశాలు లభించడంతో గత మూడు, నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లకు ఇబ్బంది లేకుండా పోయింది.
రెండు, మూడు రోజులు ఆలస్యమైనా వచ్చాయి. కానీ అప్పుల పరిమితి తీరిపోవడంతో కొత్త చిక్కులు ప్రారంభమయ్యాయి. అదనపు అప్పుల కోసం అనుమతి తెచ్చుకున్నా అమలు చేయాల్సిన పథకాల భారం మాత్రం పెరిగిపోతోంది. ఈ కారణంగా ప్రభుత్వానికి చిక్కులు ఏర్పడుతున్నాయి. ఆసరా పథకం నిధులు కూడా ఒకే సారి జమ చేయడం లేదు. వేడుకలు నిర్వహించి పది రోజుల పాటు జమ చేస్తామని చెబుతున్నారు.
దీంతో జీతాలు, పెన్షన్లతో పాటు ఆసరా పథకం డబ్బులు కూడా బ్యాంకుల్లో ఎప్పుడు పడతాయో లబ్దిదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే మంగళవారం ఆర్బీఐ నుంచి మరో రూ. రెండు వేల కోట్ల రుణం..అలాగే ఆస్తులు తాకట్టు పెట్టి మరికొన్ని వేల కోట్ల రుణాల కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇవి విజయవంతం అయితే చిక్కులు తప్పిపోతాయి.