ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి ఖచ్చితమైన సమయానికి జీతాలు చెల్లించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయినట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఇస్తుందనుకున్న ఆత్మ నిర్భర ప్యాకేజీ నిధులు ఇంకా అందలేదు. ఒకటి, రెండు రోజుల సమయం పట్టవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అవి వస్తేనే… ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ ఖాతాల్లో కేవలం రూ. ఐదు వందల కోట్లు మాత్రమే ఉన్నాయి. పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి దాదాపుగా రూ. 4700 కోట్లు అవసరం. ఆత్మనిర్భర ప్యాకేజీ నిధులు వస్తేనే అంత పెద్ద మొత్తంలో చెల్లించాడనికి అవకాశం ఏర్పడుతోంది.
మామూలుగా అయితే.. ప్రతి మంగళవారం ఆర్బీఐలో బాండ్లు వేలం వేసి రూ. రెండు వేల కోట్లు తెచ్చుకునేది. అయితే.. ఏడాదిలో చేయాల్సిన అప్పును మూడు నెలల్లోనే పూర్తి చేసేయడంతో.. బాండ్ల వేలానికి ఆర్బీఐ అంగీకరించలేదు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలు అతిక్రమించారని స్పష్టం చేయడంతో… ఆ పరిమితి పెంచుకునేందుకు చట్టం కూడా చేశారు. రెండు రోజుల కిందట.. ఎఫ్ఆర్బీఎం పరిమితిని మూడు నుంచి ఐదు శాతానికి పెంచుకునేందుకు హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ సర్కార్ కేంద్రం ఆమోదం కోసం పంపింది. కేంద్రం ఆమోదం తెలిపితే.. ఆర్బీఐలో బాండ్ల వేలం వేయడానికి అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్‌కు కేంద్రం సోమవారం ఆమోదముద్ర వేస్తే మంగళవారం బాండ్ల వేలం వేసుకోవచ్చు. ఒక వేళ ఆలస్యం అయితే.. బాండ్ల వేలానికి వచ్చే మంగళవారం వరకూ ఎదురుచూడాల్సి ఉంటుంది.
కేంద్రం వివిధ రకాలుగా ఆత్మనిర్భర ప్యాకేజీ అమలు చేస్తోంది. ఇందులో నేరుగా ప్రభుత్వాలకు నిచ్చే నిధులేమీ ఉండవు. కేంద్రం పెట్టే అనేక షరతులను అంగీకరిస్తే.. కొన్ని అంశాల్లో అమలు చేయడానికి నిధులిస్తారు. జీతాలివ్వడానికి నిధులివ్వరు. కానీ.. ఇతర వాటికి ఖర్చు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆ నిధులు తీసుకుని .. ఇప్పటికి జీతాలిచ్చి గండం గట్టెక్కాలనుకుంటోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ.. ఈ రోజే అందరికీ జీతాలివ్వడం సాధ్యం కాదంటున్నారు. గతనెలలోలా… పదో తేదీ వరకూ..విభాగాల వారీగా జీతాలు , పెన్షన్లు చెల్లించే అవకాశం ఉందంటున్నారు.