ఒకటో తేదీనే జీతం… ప్రభుత్వ ఉద్యోగులు ఇలా జీతం తీసుకొని ఎన్నేండ్లు అయ్యిందో. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, ఒకటో తేదీన రావాల్సిన జీతం ఆ నెల చివర్లో ఎప్పుడొస్తుందో తెలియక… అస్తవ్యస్థ పాలన సాగింది. ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే కొత్త లోన్లు మంజూరు కాలేదు. నెల నెలా ఈఎంఐలు కట్టేందుకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.
కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాబోతున్న ఒకటో తారీఖునే జీతం ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది సర్కార్. అవును… ఒకటో తేదీనే జీతం ఇచ్చేందుకు అధికారులు ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కేవలం జీతాలే కాదు పెన్షనర్లతో పాటు రిటైర్డ్ పెన్షన్లు కూడా ఒకటో తేదీన పంపిణీ చేసేందుకు ఆర్థిక శాఖ నిధులపై ఫోకస్ చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించిన పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ తో పాటు ఇవ్వాలంటే కనీసం 4,400కోట్ల పైగా కావాలి. వీటికి తోడు జీతాలు కూడా జత చేస్తే 10వేల కోట్ల వరకు అవసరం పడతాయి. గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా తోడవనున్నాయి.
అయితే, ఎంత ఇబ్బంది ఉన్నా జీతాలు, పెన్షన్లు ఆగకుండా ఇవ్వాల్సిందేనని… జులై 1న ఇవ్వాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ముందుగా పెన్షన్లు, ఆ తర్వాత జీతాలు చెల్లించేలా ఆర్థిక శాఖ రెడీ అవుతుంది.