కరోనా కారణంగా రెండు, మూడు నెలల పాటు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను సగానికి సగం తగ్గించిన ప్రభుత్వాలకు ఇప్పుడు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో నిధులు అందుబాటులో ఉన్నా… కరోనా సాకుతో సగం జీతాల్ని ఆపేశారు. ఇతర అవసరాలకు వినియోగించుకున్నారు. ఇప్పుడు వాటిని చెల్లించాలనే ఒత్తిడి ఉద్యోగుల నుంచి పెరుగుతోంది. దాంతో ప్రభుత్వాలు ఆ వేతన బకాయిలు చెల్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోక తప్పడం లేదు. తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు.. అసెంబ్లీలోనే ఈ ఈ వేతన బకాయిల ప్రకటనలు చేశారు. మూడు నెలల పాటు ఉద్యోగులకు .. పెన్షన్లకు సగమే ఇవ్వడంతో పెద్ద ఎత్తున బకాయిలున్నాయి. వాటిని ఒకే సారి ఇవ్వలేమని.. వాయిదాల వారీగా ఇస్తామని… ఎప్పుడు ఇస్తామనేది.. త్వరలో ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత చెబుతామని ప్రకటించారు.
ఇవాళ కాకకపోతే.. రేపైనా.. ఉద్యోగుల బకాయిల వేతనాలు చెల్లించక తప్పదు. ఈ విషయం తెలంగాణ సర్కార్కు క్లారిటీ ఉంది. అందుకే.. ఒకే సారి ఇచ్చే అవకాశం లేదని చెప్పడానికి.. హరీష్ రావు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారని అనుకోవచ్చు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఇబ్బంది. అక్కడ ఓ రిటైర్డ్ ఉద్యోగి కోర్టుకు వెళ్లడంతో.. మొత్తం బకాయిల్ని వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి రెండు నెలల గడువు ఇచ్చింది. రెండు నెలల గడువు వచ్చే నెల పదకొండోతేదీతో ముగుస్తుంది. ఆ లోపే బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండు నెలల పాటు మాత్రమే ఏపీలో సగం సగం జీతం ఇచ్చారు. అంటే.. ఒక నెల జీతాలు ఆపారన్నమాట. దాదాపుగా రూ. ఐదు వేల కోట్లు. ఎప్పుడూ ఇచ్చే జీతం కాకుండా.. రూ. ఐదు వేల కోట్లు ఈ సారి ఎక్కువగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
గతంలో ఎప్పుడు చెల్లిస్తామో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి ఉన్నట్లయితే..ఉద్యోగులు కోర్టుకు వెళ్లిఉండేవారు కాదు. కానీ ఇప్పుడు హైకోర్టు ఒకే సారి చెల్లించాలని తీర్పు చెప్పేసింది. ఇవ్వకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది. అందుకే.. ఉద్యోగ సంఘాల నేతలను తెరపైకి తీసుకువచ్చి.. విడతల వారీగా ఇచ్చినా పర్వాలేదనే పిటిషన్లు వేయించాలనే ప్రణాళికలు వేస్తున్నారు. అయితే.. ఇలా పిటిషన్ వేయడం కన్నా… తమకు ఒకే సారి వద్దని.. వడ్డీతో కలిపి వద్దని… ప్రభుత్వానికి లేఖలు రాస్తే.. దాని ప్రకారం చెల్లిస్తే సరిపోతుందన్న అంచనా ఉంది. అయితే ఎంత మంది ఉద్యోగులు లేఖలు రాస్తారన్నది కీలకం. మొత్తానికి జీతాలు ఆపినప్పుడు హాయిగానే ఉంది.. తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చే సరికి ఇబ్బంది పడుతున్నాయి ప్రభుత్వాలు. .