వైసీపీ హయాంలోనూ వారికి జీతాలు ఆలస్యమే. టీడీపీ వచ్చిన తర్వాత కూడా ఆలస్యమే. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఉపాధ్యాయులకు జీతాలు అందలేదు. పెన్షనర్లుతో సహా అందరికీ ఒకటో తేదీన జీతాలు జమ చేశారు. కానీ టీచర్ల ఖాతాల్లో మాత్రం పడలేదు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే సోమవారం ఉదయమే జీతాలు జమ అవుతాయని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. అయితే అందరికీ ఒకటో తేదీ ఇచ్చి ఉపాధ్యాయులకే ఎందుకు ఆపుతున్నారని వారు మథన పడుతున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆర్థిక పరిస్థితి ఒక్క సారిగా మారిపోదు. పరిస్థితులు చక్కబెట్టుకుంటూ రావాలి. ప్రభుత్వానికి ఓ పద్దతి ఉండాలి కాబట్టి నెల రోజుల పాటు కోసం ప్రజల కోసం పని చేసిన వారికి ఒకటో తేదీన జీతాలివ్వడాన్ని ఓ పాలసీగా పెట్టుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారం ఇస్తూ వస్తున్నారు. అయితే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల అవసరమైనంత సమకూరకపోవడంతో ఆయన టీచర్లకు మాత్రం ఆపి మిగతా వారికి చెల్లించినట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఆదాయం క్రమంగా పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడు నెలల కాలంలో ఆదాయ వృద్ధి నమోదు అవుతుంది. జనవరి నుంచి అమరావతి సహా పలు కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. వ్యాపార లావాదేవీలు పుంజుకోనున్నాయి. అందుకే వచ్చే రెండు, మూడు నెలల్లో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని ఆరు నెలల తర్వాత జీతాల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదని చెబుతున్నారు. అయితే అప్పుడప్పుడు లోటు పడితే ఉపాధ్యాయులకే జీతాలు ఆపడం.. వారిని వేదనకు గురి చేస్తోంది.