హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీస్థాయిలో జీతభత్యాలు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ దిశగా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలకు నెలకు జీతభత్యాల రూపంలో మొత్తం రు.95,000 అందుతోంది. ఈ మొత్తాన్ని 200% పెంచబోతున్నారు. అంటే సుమారుగా నెలకు రు.3 లక్షలకు వీరి జీతభత్యాలు పెరగబోతున్నాయన్నమాట. ఇటీవల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి జీతభత్యాలను పెంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దీనిపై కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో ఎమ్మెల్యేలకు జీతభత్యాలను ఇటీవల రు.4 లక్షల దాకా పెంచిన విషయాన్ని ఆయనే గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాజకీయ, రాజకీయేతర ఖర్చులు అనేకం ఉంటాయని, గ్రామాలకు, జిల్లాకేంద్రానికి, రాజధానికి తిరగాల్సి ఉంటుందని, అనేక సభలు, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. వీటన్నింటిని కలిపితే నెలకు రు.3 లక్షల వరకు వారికి ఖర్చు ఉంటుందని కేసీఆర్ అంచనా వేశారు. నిన్న దీనిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాత మంత్రులు, స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ ఛైర్మన్, ప్రభుత్వ విప్లు, ప్రతిపక్షనేతలు, క్యాబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ సలహాదారుల జీతాలను కూడా పెంచాలని ప్రభుత్వ యోచనగా చెబుతున్నారు.