సల్మాన్ ఖాన్ సినిమా `సికిందర్` ఈనెలాఖరున రాబోతోంది. ఈ సినిమా సల్మాన్ కు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈమధ్య కాలంలో సల్మాన్ సినిమా బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితాల్ని సాధించడం లేదు. తాను ఫామ్ లోకి రావాలి. తన ఫ్యాన్స్ ని మెప్పించాలి. ఇదే ధ్యేయంతో ‘సికిందర్’ చేశాడు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. మురుగదాస్‌కు కూడా ఈ సినిమా చాలా ముఖ్యం. కాబట్టి.. `సికిందర్`పై ఆశలు, అంచనాలూ పెరుగుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించింది. తన లక్కీ ఛార్మ్ `సికిందర్`కు కలిసొస్తుందని చిత్రబృందం భావిస్తోంది.
అయితే ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించడం ట్రోల్స్‌కు గురవుతోంది. దానికీ కారణం ఉంది. సల్మాన్ వయసు..59 ఏళ్లు. రష్మికకు 28 మాత్రమే. అంతే కాదు. రష్మిక తండ్రి కంటే.. సల్మాన్ ఖాన్ మూడేళ్లు పెద్ద. తన తండ్రి కంటే పెద్ద వయసున్న సల్మాన్ తో రష్మిక ఎలా నటించింది? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు సల్మాన్‌ని కార్నర్ చేస్తున్నారు. కూతురి వయసున్న అమ్మాయితో రొమాన్స్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై సల్మాన్ సైతం స్పందించాడు. ‘రష్మికకు లేని ఇబ్బంది మీకేంటి?’ అంటూ విమర్శకులపై డైరెక్ట్ ఎటాక్‌కు దిగాడు సల్మాన్ భాయ్. ‘రష్మికకు పెళ్లై కూతురు పుడితే.. తాను కూడా స్టార్ అవుతుంది. అప్పుడు తనతో కూడా నేను నటిస్తా. అప్పుడు రష్మిక అనుమతి తప్పకుండా తీసుకొంటా’ అని విమర్శకులకు ధీటుగా సమాధానం ఇచ్చాడు. రష్మిక చాలా హార్డ్ వర్కర్ అనీ, ‘పుష్ప 2’ కోసం రాత్రి ఆరున్నర వరకూ పని చేసి, 9 గంటలకు `సికిందర్` సెట్ కి వచ్చేదని, మళ్లీ తెల్లవార్లూ ‘సికిందర్’ కోసం వర్క్ చేసి, మళ్లీ ‘పుష్ప 2’ షూటింగ్ కి వెళ్లేదని, తన డెడికేషన్ మెచ్చుకోవాల్సిందే అని సల్మాన్ కితాబు ఇచ్చాడు.