రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. మైసూర్లో తొలి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షూటింగ్ లో చరణ్ కూడా పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ కనిపిస్తాడని సమాచారం అందుతోంది. ఆ స్టార్ కోసం చిత్రబృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అన్నీ కుదిరితే ఈ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తాడు.
రామ్ చరణ్‌తో సల్మాన్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ ఫ్రెండ్ షిప్‌తోనే `గాడ్‌ఫాదర్`లో నటించాడు సల్మాన్. ఆ సినిమాకు ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోలేదని అప్పట్లో చిరంజీవి స్వయంగా చెప్పారు. సల్మాన్ ఖాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, చరణ్ ఆతిధ్యం ఇస్తుంటాడు. అలానే చరణ్ ముంబై ఎప్పుడు వెళ్లినా సల్మాన్‌ని పలకరించి వస్తుంటాడు. వీళ్ల మధ్య అంతటి అనుబంధం ఉంది. ఇప్పుడు అదే ఫ్రెండ్ షిప్‌తో.. ఈ సినిమాలో నటించడానికి సల్మాన్ ఒప్పుకొంటాడని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది. అదే జరిగితే… ఓ క్రేజీ కాంబోని తెరపై చూసే అవకాశం దక్కుతుంది. సంక్రాంతి లోగా ఈ కాంబోపై ఓ అధికారిక ప్రకటన రావొచ్చు.
ఈ చిత్రానికి `పెద్ది` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. నిజానికి ఇది ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రాసుకొన్న కథ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్టీఆర్ చేయలేకపోయాడు. దాంతో చరణ్ దగ్గరకు వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ కోసం బుచ్చిబాబు చాలాకాలం వెచ్చించాడు. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.