బాలీవుడ్ పై సౌత్ సినిమాల ప్రభావం ఎంత ఉందో తెలియడానికి ‘సికిందర్’ ట్రైలర్ చూస్తే సరిపోతుంది. సల్మాన్ ఖాన్ – మురుగదాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. ఈనెల 30న విడుదల అవుతోంది. మూడున్నర నిమిషాలకు పైగానే సాగిన ట్రైలర్… పక్కా సౌత్ ఇండియన్ మసాలా రెసిపీతో తయారైన సినిమా అనే ఫీలింగ్ కలిగించింది. యాక్షన్, డైలాగులు, ఆ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ దక్షిణాది సినిమాల్ని ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాల్ని పోలి ఉన్నాయి.
మురుగదాస్ దక్షిణాది దర్శకుడే. కాబట్టి ఆ టింజ్ ఉందనుకోవొచ్చు. కానీ ఇది వరకు ఆయన ‘గజిని’ తీశారు. అది పూర్తిగా బాలీవుడ్ స్టైల్ లో సాగే సినిమా. ఈమధ్య తెలుగు, తమిళ సినిమాలు ముంబై బాక్సాఫీసుని సైతం షేక్ చేస్తున్నాయి. మన మసాలా సినిమాలు అక్కడ మంచి వసూళ్లు రాబట్టుకొంటున్నాయి. అందుకే బాలీవుడ్ హీరోలు కూడా దక్షిణాది స్టైల్ లో సాగే కథల్లో కనిపించడానికి రెడీ అవుతున్నారు. షారుఖ్ నటించిన ‘జవాన్’ అలాంటి కథే. ఇప్పుడు ‘సికిందర్’ని కూడా ఇదే జాబితాలో చేర్చొచ్చు. ట్రైలర్ కట్, యాక్షన్ సీన్స్, హీరోయిజం ఎలివేషన్లు, మాస్ డైలాగులు ఇవన్నీ పక్కాగా తమిళ, తెలుగు సినిమాల కొలతల్లో సాగాయి. ప్రధాన ప్రతినాయకుడిగా సత్యరాజ్‌ని ఎంచుకోవడం, దక్షిణాది కథానాయిక రష్మిక ఈ సినిమాలో కనిపించడం ఇవన్నీ సౌత్ ఫీలింగ్ ని మరింత తీసుకొచ్చాయి.
ట్రైలర్ పవర్ ప్యాక్డ్ గానే ఉంది. కాకపోతే మురుగదాస్ ముద్ర ఎక్కడా కనిపించలేదు. అదంతా.. సినిమా కోసం దాచి ఉంచారేమో..?