హైదరాబాద్: సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘సుల్తాన్’లో భారతీయ మల్లయోధుడి పాత్రలో నటించనున్నారు. ఈ పాత్రకోసం సల్మాన్ 15 కిలోల బరువు పెరగనున్నారు. బరువు పెరగటమంటే ఏది పడితే అది తిని బరువు పెరగటం కాకుండా, ఒక పద్ధతిగా ట్రైనర్ సూచనల మేరకు హై ప్రోటీన్ ఫుడ్‌ను ఆహారంగా తీసుకుని బరువు పెరగబోతున్నారు. మళ్ళీ దానికి తగ్గట్టుగా వ్యాయామంకూడా చేస్తున్నారు. రోజుకు దాదాపుగా నాలుగు గంటలపాటు ఎక్సర్సైజ్లు చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ‘మేరే బ్రదర్ కీ దుల్హన్’, ‘గుండే’ చిత్రాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జఫర్ తన మూడవ చిత్రంగా ‘సుల్తాన్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. చిత్రం వచ్చే ఏడాది జులై 8న బక్రీద్ సందర్భంగా విడుదల కాబోతోంది. షారుక్ ఖాన్ ‘రయీస్’ చిత్రంకూడా అదే రోజు విడుదలవుతోంది.
మరోవైపు ఆమిర్ ఖాన్ కూడా తన తదుపరి చిత్రం ‘దంగల్’లో మల్లయోధుడి పాత్రనే పోషించటం విశేషం. మహావీర్ సింగ్ ఫోగత్ అనే ఆ నిజజీవిత పాత్రకోసం ఆమిర్ కూడా బరువు పెరిగారు. ఈ చిత్రంకోసం సల్మాన్ వ్యక్తిగత ట్రైనర్ రాకేషే ఆమిర్‌కు కూడా ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు.