ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ “‘యాకుబ్ మీమన్ నిర్దోషి…అతనిని ఉరి తీయవద్దని” కోరుతూ ట్వీట్ మెసేజ్ పెట్టారు. కానీ దానికి నిరసనలు, విమర్శలు ఎదురవడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, ప్రజలకి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. “ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళలో అనేక మంది చనిపోయారని, ఒక్క మనిషి ప్రాణం కోల్పోయినా అది మానవత్వం అనిపించుకోదు. అందుకే యాకుబ్ మీమన్ని క్షమించి అసలు నేరస్థుడయిన టైగర్ మీమన్ని ఉరి తీయమని కోరానని” సల్మాన్ ఖాన్ సంజాయిషీ ఇచ్చుకొన్నారు. “భారతీయ న్యాయ వ్యవస్థల పట్లతనకు చాలా గౌరవం ఉందని అన్నారు. తను ఉద్దేశ్యపూర్వకంగా ఆ విధంగా అనలేదని కానీ తన వ్యాఖ్యలు ఎవరి మనసులని నొప్పించినా క్షమించమని” ఆయన కోరారు.
సల్మాన్ ఖాన్ తనకి ఎదురయిన విమర్శలు, నిరసనల కారణంగానే తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని ప్రజలకి క్షమాపణలు చెప్పి ఉండవచ్చును. లేదా ఆ కారణంగా తన సినిమాలకు, సినీ కెరీర్ కి ఊహించని సమస్యలు ఎదురవుతాయని వెనక్కి తగ్గి ఉండవచ్చును. కానీ అంత మాత్రాన్న ఆయన మనసులో అభిప్రాయాలను కూడా మార్చుకొంటారని భావించలేము. మారలేదని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.
తను ఉద్దేశ్య పూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని చెపుతున్న సల్మాన్ ఖాన్ అంతకు ముందు పోస్ట్ చేసిన మెసేజ్ లో “గత మూడు రోజులుగా దీనిపై ట్వీట్ చేయాలని అనుకొంటున్నప్పటికీ ఆగిపోయాను. కానీ ఇది ఒక మనిషి ప్రాణానికి, అతనిపై ఆధారపడిన ఒక కుటుంబానికి చెందిన విషయం కనుకనే స్పందిస్తున్నాను,” అని చెప్పడం చూస్తే అది ఉద్దేశ్య పూర్వకంగా చేసినదేనని స్పష్టం అవుతోంది. కానీ కాదని ఆయన బుకాయిస్తున్నారు.
యాకుబ్ మీమన్ ప్రాణం గురించి, అతనిపై ఆధారపడిన కుటుంబం గురించి అంతగా బాధపడిపోయిన సల్మాన్ ఖాన్ మరి యాకూబ్ సోదరుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 250 మంది గురించి, వీధిన పడ్డ వారి కుటుంబాల గురించి, ఆ ప్రేలుళ్ళలో శాశ్విత అంగ వైకల్యం పొంది రోడ్డున పడిన అనేక మంది గురించి ఎందుకు ఆలోచించడం లేదు? చనిపోయిన, గాయపడిన వారిలో కూడా ముస్లిం ప్రజలున్నారు కదా? అనే ప్రశ్నకు కూడా ఆయనే జవాబిస్తే బాగుంటుంది. యాకూబ్ మీమన్ని ఉరి తీస్తే భారత ప్రభుత్వానికి మానవత్వం లేనట్లే అనుకొంటే మరి 250 మంది ప్రజల ప్రాణాలను బలిగొన్న యాకూబ్ సోదరుల సంగతేమిటి? అటువంటి కరడుగట్టిన ఉగ్రవాదిని సల్మాన్ ఖాన్ సమర్ధించడం మానవత్వమేనా?
విమర్శలు, నిరసనలు ఎదురయిన తరువాత భారతీయ న్యాయవ్యవస్థల పట్ల తనకు గౌరవం ఉందని సల్మాన్ ఖాన్ చెపుతున్నారు. కానీ అది నిజం కాదని ఆయన మొదటి ట్వీట్ మెసేజ్ స్పష్టం చేస్తోంది. సుమారు రెండు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా న్యాయ విచారణ చేసి, యాకూబ్ మీమన్ కి తను నిర్దోషి అని నిరూపించుకొనేందుకు అన్ని అవకాశాలు కల్పించిన తరువాత కూడా అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేకపోయాడు. అప్పుడే ప్రత్యేక కోర్టు అతనికి తగిన శిక్ష వేసింది. దానిని సుప్రీంకోర్టు మళ్ళీ విచారించిన తరువాతనే ఉరి శిక్షను ఖాయం చేసింది. ఆ తరువాత మళ్ళీ అతను రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకొనేందుకు కూడా మన న్యాయ వ్యవస్థలు అవకాశం కల్పించాయి. కానీ రాష్ట్రపతి కూడా ఆయన క్షమార్హుడు భావించినందునే అతని క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించారు. ఇంత సుదీర్ఘమయిన న్యాయ ప్రక్రియని సల్మాన్ ఖాన్ వంటి వారు ఒక్క నిమిషంలో తప్పు అని తేల్చి చెప్పడం మన న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం నమ్మకం లేకనేనని చెప్పక తప్పదు. యాకుబ్ ఉరి శిక్షని సల్మాన్ ఖాన్ తో సహా చాలా మంది మతకోణంలో నుండి చూస్తూన్నారే తప్ప మన న్యాయవ్యవస్థల తీర్పులనే ప్రశ్నిస్తున్నామని భావించడం లేదు. సుప్రీం కోర్టు తీర్పులనే ప్రశ్నించడం మొదలుపెడితే ఇక దేశంలో న్యాయవ్యవస్థనే రద్దు చేసుకొని ఆటవిక న్యాయం అమలు చేసుకోవలసి వస్తుంది.