రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కేవలం రాజకీయాల విషయంలోనే కాదు.. మనుషులెవరి మధ్య నయినా.. శాశ్వత మితృత్వం, శత్రుత్వం ఉండదని అనుకోవాలి. కొందరి మధ్య బంధాలను చూస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. ప్రస్తుతానికి అందుకు ఉదాహరణ ఇద్దరు బాలీవుడ్ హీరోలు. వారు.. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబరేరాయ్ లు. ఒకప్పుడు వీళ్లిద్దరూ బద్ధ విరుధులు.. ఎంత విరోధులంటే, ఒక దశలో వివేక్ ను సల్మాన్ హెచ్చరించాడు. అంతు చూస్తా.. అని బెదిరించాడు.
అంతలా వారి మధ్య శత్రుత్వం పెరగడానికి కారణం ఐశ్వర్య రాయేనని వేరే చెప్పనక్కర్లేదు. సల్మాన్ తో బ్రేకప్ అయ్యాకా.. ఐశ్వర్యరాయ్ వెళ్లి వివేక్ కు దగ్గరయ్యింది. అప్పటికి ఇంకా బాలీవుడ్ లో నిలదొక్కుకునే దశలో ఉన్నాడు వివేక్. తండ్రి వారసత్వం, వ్యాపార సామ్రాజ్యాలు అండగా ఉండటంతో వివేక్ హిట్లు లేకపోయినా సెలబ్రిటీగా మారిపోయాడు. అదే సమయంలో ఐష్ కు దగ్గరయ్యాడు. వీళ్లిద్దరూ కలిసి విహరించడం మొదలైంది. దీంతో సల్మాన్ కు కోపం వచ్చింది. బ్రేకప్ తర్వాత కూడా ఐష్ ను ప్రేమిస్తూనే ఉండిన సల్లూ.. వివేక్ పై ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. వివేక్ అంతు చూస్తానని తన సన్నిహితుల మధ్య పలు సార్లు హెచ్చరికలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.
అయితే ఆ తర్వాత ఐష్ వీళ్లిద్దరికీ దక్కకుండా పోయింది. వివేక్ తోనూ బ్రేకప్ చెప్పిన ఐష్ అబిషేక్ ను వివాహం చేసుకుని సెటిలయ్యింది. మరి ఐష్, వివేక్ లు ఇద్దరూ కలిసి అభిషేక్ పై ఆగ్రహాలను అయితేప్రదర్శించలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వివేక్ ఒబెరాయ్ సల్మాన్ ను ప్రశంసించడం ఆసక్తికరంగా ఉంది. సుల్తాన్ సినిమా విషయంలో వివేక్ స్పందిస్తూ.. సల్మాన్ సూపరని ప్రశంసించాడు. ఇది వరకూ ఎప్పుడూ వివేక్ ఇలా సల్మాన్ ను ఆకాశానికెత్తింది లేదు. మరి ఈ ప్రశంసతో వీరిద్దరూ ఫ్రెండ్సయిపోయినట్టే కాబోలు!