బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఒక సీరియస్ కేసు నుంచి విముక్తి పొందినా అతణ్ణి మరో కేసు వెంబడిస్తూనే ఉంది. అయినప్పటికీ కారు ప్రమాద కేసులో నిర్దోషి అని తేలగానే సల్మాన్ పెళ్ళికి సంబంధించిన వార్తాకథనాలు మీడియాలో షికారుచేస్తున్నాయి. ఈ కథనాల్లోని నిజమెంతో ఒక్క సల్మాన్ మాత్రమే చెప్పగలడు.
13ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశమున్న కారు ప్రమాద కేసు నుంచి బయటపడటంతో, గ్రహణం విడిచిన చంద్రుడిలా వెలిగిపోతున్నాడు 49ఏళ్ల బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. గడచిన 13 ఏళ్లుగా కారు ప్రమాదం కేసులో విచారణ ఎదుర్కుని, ప్రస్తుతం బొంబాయి హైకోర్ట్ నిర్దోషిగా తేల్చిచెప్పడంతో సల్మాన్ జీవితంలో కారుమేఘాలు తొలిగిపోయాయన్నది నిజమే. మద్యం మత్తులో కారునడిపి పేవ్ మెంట్ మీదకు ఎక్కించి ఒకరి మరణానికీ, మరో నలుగురు గాయపడటానికి కారణమయ్యారన్న అభియోగాన్ని ఎదుర్కున్న సల్మాన్ మనస్సు ఇప్పుడు స్థిమతపడిందన్నది వాస్తవమే. అంతమాత్రాన పెళ్ళికి వెంటనే ఎగిరిగంతేస్తాడని చెప్పలేము. ఎందుకంటే అతణ్ణి మరోకేసు వెంటైడుతూనే ఉంది.
కారు ప్రమాద కేసు 2002నాటి నుంచి కేసు విచారణ జరుగుతుండటంతో ఎవరు పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. అయితే హైకోర్ట్ తాజాగా నిర్దోషి అని ప్రకటించడంతో సల్మాన్ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాడన్న వార్తలు పొక్కాయి. ఆంగ్లంలో వార్తలను అందించే ఒక వెబ్ సైట్ మరికాస్త మందుకువెళ్ళి వచ్చే ఏడాది (2016)లోనే సల్మాన్ పెళ్ళి – అంటూ వార్తాకథనాన్ని పోస్ట్ చేసింది.
సల్మాన్ ఖాన్ 34 ఏళ్ల వయసప్పుడే వివాహం చేసుకోవాల్సింది. కానీ సరిగా అదేసమయంలో కేసులో ఇరుక్కున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు ఎప్పుడు పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూవస్తున్నాడు. ఈ కేసుకుతోడు సల్మాన్ పై జింకలను వేటాడటానికి సంబంధించిన కేసుకూడా నడుస్తోంది. ఈ రేండు కేసులు నడుస్తున్నప్పుడు పెళ్ళి చేసుకుని తన భార్యకు ఏమని సమాధానం చెప్పగలనన్నది సల్మాన్ మీమాంశ. పుట్టే పిల్లలకు తన తండ్రి జైలుకు వెళ్లాడని భార్య ఎలా చెప్పగలదని ఆవేదన పడుతుండేవాడు. ఎక్కడ టివీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇలాగే మాట్లాడేవాడు. లీగల్ కేసులు తేలేదాకా తన పర్సనల్ లైఫ్ లోకి ఎవ్వరినీ ఆహ్వానించలేనని కరాఖండిగా చెప్పేవాడు. 2002నాటి హిట్ అండ్ రన్ కేసు ఒక కొలిక్కి వచ్చినా, జింకల వేట కేసు ఇంకా తేలలేదు. మరి ఈ పరిస్థితుల్లో 49ఏళ్ల సల్మాన్ పెళ్ళికి రెడీ అవుతాడా లేదా అన్నది ఎవ్వరూ అంచనావేయలేరు. అందుకే ఊహాజనిత వార్తలు షికారు చేస్తున్నాయి.
రెండు కేసులు కొలిక్కి వస్తేనేకానీ సల్మాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడని ఇంతవరకు అనుకుంటుంటే, అతని సన్నిహితుల్లో ఒకరిద్దరు ఈ పెళ్ళి వార్త లీక్ చేశారు. ఈ వార్తను ఆధారంగా చేసుకుని సల్మాన్ కు వచ్చే ఏడాది (2016)లో పెళ్ళంటూ ఆంగ్లంలో వార్తలను అందించే ఒక వెబ్ సైట్ ప్రముఖంగా వార్తాకథనాన్ని అందించింది. బొంబాయి హైకోర్ట్ తీర్పు దరిమలా సల్మాన్ పెళ్ళికి సంబంధించిన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇంతవరకు సల్మాన్ ఈ విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. బహుశా అన్ని కేసుల నుంచి విముక్తి పొందిన తర్వాతనే సల్మాన్ పెళ్ళి సంగతి ఎత్తుతాడని అనుకోవచ్చు. ఈలోగా వచ్చే వార్తాకథనాలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.