Samajavaragamana movie review
రేటింగ్: 2.75/5
యంగ్ హీరోలంతా ఒకప్పుడు క్లీన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసిన వాళ్లే. కానీ… ఒకట్రెండు హిట్లు పడగానే మాస్ ఇమేజ్ కోసం వెంటనే రూటు మార్చేశారు. యాక్షన్ సినిమాలు చేసి ఇబ్బంది పడ్డారు. శ్రీ విష్ణుకి కూడా లైటర్ వే కథలు బాగా అచ్చొచ్చాయి. బ్రో చేవారెవరురా, రాజ రాజ చోర… వీటిలో క్రైమ్ ఎలిమెంట్ కాస్త ఉండేచ్చు. కానీ బేసిగ్గా అన్నీ ఫన్ సినిమాలే. తన కంఫర్ట్ జోనర్ కూడా అదే. వాటిని దాటుకొని వచ్చినప్పుడల్లా ఎదురు దెబ్బలే తగిలాయి. అందుకే మరోసారి.. తనకు అచ్చొచ్చిన బాటలోనే నడిచి, ‘సామజవరగమన’ అంటూ కొత్త పాట పాడాడు. కేవలం నవ్వించడానికే ఈ సినిమా తీశా… అని చెప్పుకొన్న శ్రీవిష్ణు.. ఇచ్చిన మాటని ఎంత వరకూ నిలబెట్టుకొన్నాడు? ఈ జోరన్ శ్రీవిష్ణుకి మరో హిట్ అందించిందా, లేదా?
బాలు (శ్రీవిష్ణు) ఓ మల్టీప్లెక్స్‌లో పని చేస్తుంటాడు. తనది మధ్యతరగతి మనస్తత్వం. ఇంటిని పోషించే బాధ్యత కూడా తనదే. తండ్రి (నరేష్) తో డిగ్రీ పాస్ చేయించాలన్నది తన ఆశయం. ఎందుకంటే.. ఆయన చేతికి డిగ్రీ వస్తేనే.. తాత ఆస్తులు చేతికి అందుతాయి. ఈసారి నాన్న చేతికి ఎలాగైనా సరే, డిగ్రీ పట్టా అందివ్వాలన్న తాపత్రయంతో డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలు రాస్తున్న సరయు (రెబా మౌనికా జాన్)ని సాయం చేయమని అభ్యర్థిస్తాడు. సరయూ కూడా ఓకే అంటుంది. కాకపోతే ఈసారి కూడా ‘డిగ్రీ’ కల నెరవేరదు. సరికదా… పేయింగ్ గెస్ట్ పేరుతో బాలు ఇంట్లోనే తిష్ట వేస్తుంది సరయు. క్రమంగా బాలు అంటే అభిమానం, ప్రేమ ఏర్పడతాయి. కాకపోతే… బాలుకే ప్రేమంటే గిట్టదు. ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయికల్లా.. రాఖీ కట్టేస్తుంటాడు. అయినా సరే, ఆపసోపాలు పడి బాలుని తన బుట్టలో వేసేసుకొంటుంది. ఇక అంతా హ్యాపీ అనుకొంటున్న తరుణంలో.. సరయుకి సంబంధించిన ఓ చేదు నిజం.. బాలుకి తెలుస్తుంది. అదేంటి? సరయుని పెళ్లాడాలనుకొన్న బాలు ఆశ ఫలించిందా, లేదా? తన తండ్రి డిగ్రీ పాసయ్యాడా, లేదా? సరయు రాకతో బాలు జీవితంలో ఏర్పడిన గందరగోళాలేంటి? ఇవన్నీ తెరపై చూసి నవ్వుకోవాల్సిందే.
ఎంటర్టైన్మెంట్ సినిమాల సౌలభ్యం ఏమిటంటే.. కథ రేఖామాత్రంగా ఉంటే చాలు. లాజిక్‌లు అవసరం లేదు. ఏం చేసినా, ఎలా చేసినా ప్రేక్షకుల్ని నవ్వించడమే పరమావధి కాబట్టి.. ప్రేక్షకులు కూడా లాజిక్కుల్ని పట్టించుకోరు. కాకపోతే.. ఈ జోనర్లో ఉన్న మైనస్సులు కూడా అచ్చంగా ఇవే. చిన్న పాయింట్ తో రెండు గంటలు ప్రేక్షకుల్ని కన్వెన్స్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా ఆడిటోరియంని నవ్వించడం కూడా తేలికేం కాదు. ఎంత లాజిక్కుల్ని పక్కన పెట్టినా క్లీన్ ఫన్ అనేది కత్తిమీద సామే. అయితే… ఎత్తుకొన్న చిన్న పాయింట్ తోనే – రెండు గంటల టైమ్ పాస్ చేయించేసింది చిత్రబృందం. తరవాత ఏం జరుగుతుంది? అనేది తేలిగ్గా అర్థమైపోయినా సరే, అదేం పెద్ద ఇబ్బంది కాకుండానే సినిమాని హాయిగా నడిపేశాడు దర్శకుడు.
అసలు ఈ సినిమానే ఓ వెరైటీ సెటప్‌తో మొదలవుతుంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ గుర్తుంది కదా..? అందులో వెంకటేష్ డిగ్రీ పాస్ అవ్వాలని చంద్రమోహన్ తాపత్రయపడే సీన్ మర్చిపోలేం. కొడుక్కి.. ఎగ్జామ్ హాల్ దగ్గర చీటీలు అందిస్తూ దొరికిపోతాడు చంద్రమోహన్. అది తండ్రి వైపు స్టోరీ. దాన్నే కొడుకు వైపు టర్న్ చేశాడు దర్శకుడు. ‘నేను ఫలానా సినిమాని స్ఫూర్తిగా తీసుకొన్నాను’ అని చెప్పడానికి ఓ చోట… ‘నువ్వు నాకు నచ్చావ్’ లో కాపీ సీన్ కూడా వాడేశాడు. తండ్రితో కొడుకు పరీక్షలు రాయించడం, వీలున్నప్పుడల్లా క్లాసులు పీకడం.. ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. సినిమాలో ఫన్ వర్కవుట్ అవ్వడానికి ఈ ఎపిసోడ్లు బాగా ఉపయోగపడ్డాయి. నరేష్ పాత్రని దర్శకుడు బాగా వాడుకొన్నాడు. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో డిగ్రీ పూర్తి చేయడానికి నరేష్ పడే పాట్లు, అల్లరి నవ్విస్తాయి. తెలుగు సినిమాల్లో సాధారణంగా డైనింగ్ టేబుల్ సీన్ అంటే.. తండ్రి కొడుక్కి చివాట్లు వేయ్యడం, కొడుకు అలిగి వెళ్లిపోవడం కనిపిస్తాయి. ఇక్కడంతా రివర్స్. ఆ రివర్స్ ప్లేతోనే ఫన్ రాబట్టుకొన్నాడు దర్శకుడు.
ఆ తరవాత పేయింగ్ గెస్ట్ గా హీరోయిన్.. హీరో ఇంట్లో దిగడం, అక్కడ హీరోని లవ్ లో పడేయడం సరదాగా నడిచిపోతాయి. అమ్మాయిల మనస్తత్వాల గురించి, రాఖీ పండగని కమర్షియల్ గా ఎలా మార్చేశారో వివరిస్తూ శ్రీ విష్ణు చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ .. ఫస్టాఫ్ హైలెట్స్‌లో ఒకటి. ఆ డైలాగులకు తప్పకుండా కుర్రాళ్లు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే.. ఇది కంప్లీట్ లవ్ స్టోరీ కాదు. అమ్మాయిల మనస్తత్వాలపై తీసిన కథా కాదు. అయినా ఆ లాజిక్ ఎవరికీ పట్టదు. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి అలాంటివి జనం పెద్దగా పట్టించుకోరు. ఫన్ వర్కవుట్ అయితే చాలు. అది దొరికేసింది కాబట్టి ప్రేక్షకులు కూడా సంతృప్తి చెందుతారు. లవ్ స్టోరీల్లో కాన్ఫిక్ట్ చాలా ముఖ్యం. ఎంత కొత్త కాన్ఫిక్ట్ ఎత్తుకొంటే సినిమా అంత బాగా పండుతుంది. ఈ సినిమాలో కాన్ఫిట్ల్ మాత్రం మరింత వెరైటీ. అది ఇప్పుడే రివీల్ చేయకూడదు కాబట్టి.. తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఇంట్రవెల్ కార్డు పడ్డాక.. క్లైమాక్స్‌లో హీరో సమస్యని దర్శకుడు ఎలా డీల్ చేశాడో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. దానికి తగ్గట్టే క్లైమాక్స్ ఉంది కూడా. ఇంట్రవెల్ నుంచి, క్లైమాక్స్ వరకూ బండి లాగడం దర్శకుడికి పెద్ద పరీక్ష. సెకండాఫ్ లో దర్శకుడు అసలు కథ చెప్పాలి, ట్విస్టుల్ని రివీల్ చేయాలి. అలాంప్పుడు కథ స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. సామజ వరగమనలో కూడా అదే జరిగింది. ఫస్టాఫ్ తో పోలిస్తే ఆ వేగం సెకండాఫ్‌లో ఉండదు. అలాగని బోర్ కూడా కొట్టదు. ప్రేక్షకుల్ని కాసేపు మెస్మరైజ్ చేయడానికి.. ‘కుల’ శేఖర్ పేరుతో వెన్నెల కిషోర్‌ని రంగంలోకి దింపాడు దర్శకుడు. ఈ ప్లాన్ కొంత వర్కవుట్ అయ్యింది. ‘కుల’ శేఖర్ చేసేదేంటో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పేరులోనే ఆ క్యారెక్టర్ మెంటాల్టీ ఉంది. ఈ ట్రాక్.. యూ ట్యూబ్‌లో ఫేమస్ అయిన ఓ వీడియో కంటెంట్ ని గుర్తుకు తెస్తుంది. కాకపోతే.. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగా పేలడంతో థియేటర్లో మళ్లీ నవ్వులు పూస్తాయి. ‘జర్సీ’లోని ఓ ఫేమస్ సీన్.. ఈ సినిమాలో పేరడీ చేశారు. అది కూడా ఓకే అనిపిస్తుంది. అలా.. మధ్యమధ్యలో కాస్త డల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ… ఫన్ మిస్ కాకుండా చూసుకోవడంతో – సెకండాఫ్ కూడా గట్టెక్కేసింది.
శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ బాగుంటుంది. తను ఇలాంటి కథలపై దృష్టి పెడితే మళ్లీ ట్రాక్ లోకి రాగలడు. తన క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకి బలం. ఆద్యంతం హుషారుగా నటించాడు. తన బలం ఎమోషన్ని పండించడం. దాన్ని చూపించే అవకాశం చాలా లిమిట్ గా వచ్చినా సరే, వాడుకోగలిగాడు. రెబా మౌనికా ని చూడగానే ‘ఆమె హీరోయినా’ అనిపిస్తుంది. కానీ రాను రాను ఆ పాత్ర కూడా నచ్చేస్తుంది. సరయు పాత్రలో ఉన్న చలాకీదనంతో ట్రావెల్ అయిపోతాం. ఇక ఈ సినిమాలో మరో హీరో.. నరేష్. తన అనుభవం అంతా రంగరించి చేసిన క్యారెక్టర్ ఇది. పెళ్లాల్ని గ్రిప్‌లో ఇలా పెట్టుకోవాలి.. అని చెప్పే డైలాగ్, ఆ సీన్… థియేటర్ని ఘెల్లుమనిపిస్తుంది. వెన్నెల కిషోర్ ఉన్నంత సేపూ.. నవ్వుతూనే ఉంటారు. శ్రీకాంత్ అయ్యంగార్, రఘుబాబు, సుదర్శన్… వీళ్లంతా తమ పాత్రల పరిధిమేర చేశారు.
గోపీ సుందర్ ఆల్బమ్‌లో ఒక్క పాటైనా బాగుంటుది. కానీ ఎందుకో ఈ ఆల్బమ్ లో అలాంటి పాట ఒక్కటీ కనిపించలేదు. పాటలూ ప్లస్ అయితే.. ఈ సినిమా మరో రేంజ్లో ఉండేది. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ కూడా షార్ప్‌గా అనిపించింది. డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. చిన్న చిన్న మూమెంట్సే.. కానీ.. కొన్ని చోట్ల బాగా వర్కవుట్ అయ్యాయి. దర్శకుడు కథని నమ్మి చేసిన సినిమా కాదిది. తనలోని రైటింగ్ స్కిల్ ని నమ్మిన సినిమా. చిన్న పాయింట్ తో.. రెండు గంటలు నడిపించాలంటే సీన్లు బాగా పండాలి. అలాంటి సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి.
ఓటీటీల ప్రభావంతో, సినిమాల్లో బూతు యదేద్ఛగా వాడేస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. క్లీన్ ఇమేజ్ సినిమాలు రావడం అరుదైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ హాయిగా… ఇంటిల్లిపాదీ.. పాప్‌కార్న్ తింటూ.. రిలాక్స్‌గా.. నవ్వుకొంటూ చూసేలా సామజవరగమన తీర్చిదిద్దారు.
రేటింగ్: 2.75/5