ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆహ్వానించడంతో ఆ రాష్ట్రానికి వెళ్ళిన తెలంగాణా ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలంగాణాలో ఇంటింటికీ మంచి నీళ్ళు సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అవి కాకుండా తెలంగాణాలో చేపడుతున్న అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఆయన వారికి చక్కగా వివరించారు. ఆ ప్రాజెక్టు లక్ష్యాలు, దాని కోసం ప్రభువ్తం అమలు చేస్తున్న విధానాలు, వాటి ఫలితాల గురించి ఆయన వారందరికీ అర్ధమయ్యేలాగా ఎంతో చక్కగా విడమరిచి చెప్పిన విధానం చూసి యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముగ్దులయిపోయారు. తెలంగాణాలో అమలుచేస్తున్న ఆ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుని చూసేందుకు త్వరలోనే తను తెలంగాణాలో పర్యటిస్తానని అఖిలేష్ తెలిపారు. ఆ తరువాత అఖిలేష్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, మంత్రి కె. తారక రామారావు రాజకీయాల గురించి మాట్లాడుకొన్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాజకీయాలు, బీహార్ ఎన్నికల గురించి వారు మాట్లాడుకొన్నారు. దేశ రాజకీయాలపై మంత్రి కె. తారక రామారావుకి ఉన్న అవగాహన చూసి ములాయం సింగ్ చాలా మెచ్చుకొన్నారు. ఆయనకు ఉజ్వలరాజకీయ భవిష్యత్ ఉందని, రాష్ట్రంలో ప్రముఖ నేతగా ఆయన ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు.