ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ కలహం దాని నాశనానికే దారితోస్తోంది. మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుడు, గాంధారి నడుమ సాగిన సంభాషణ.. యాదవ కుల క్షయం ఈ సందర్భంగా గుర్తుకొస్తోంది. కౌరవ వంశ నాశనానికి కారణమయ్యాడని భావించిన గాంధారి శ్రీకృష్ణుణ్ణి.. నీ కులం కూడా ఇలా నశించిపోతుందని శపిస్తుంది. ధృతరాష్ట్రుని భార్య గాంధారి మహాభారత యుద్ధానంతరం పుత్రశోకంతో అన్న మాటలకు తథాస్తు దేవతలు సానుకూలంగానే స్పందించారు. అప్పట్లో యాదవ కులం అలాగే నాశనమైంది. దానికి సమాధానంగా యాదవ కుల భూషణులు నిజమే వారు ఒకరినొకరు పరిహరించుకుంటారని చిరునవ్వుతో బదులిస్తాడు. ఆధునిక భారతంలోని ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయవతి గాంధారి వంటిది కాదు కానీ, సమాజ్‌వాదీకి చెందిన యాదవులు మాత్రం శ్రీకృష్ణుని మాటలను నిజం చేసే దిశగా సాగుతున్నారు.
తాజా పరిణామాలు చూస్తుంటే శ్రీకృష్ణుని మాటలను జ్ఞప్తికి తెస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడూ, ముఖ్యమంత్రీ అయిన అఖిలేశ్ యాదవ్‌ల మధ్య శివపాల్ యాదవ్ రూపంలో వచ్చిన చిచ్చు పార్టీని ముక్కలు చేసే దిశగా దారితీస్తోంది. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిణామాలు మాయావతికి అనుకూలంగా పరిణమించే అవకాశాలున్నాయి. యాదవ కులస్థులే సమాజ్‌వాదీ పార్టీ విచ్ఛిన్నానికి కారకులవుతుండడం ఇక్కడ ఆసక్తికరం. దీనికి మహాభారతానికి సంబంధముండడం సైతం విశేషం.
వృష్ణి వంశస్థులకు మరణం లేదు. వారిని మనుషులు కానీ, దేవతలు కానీ సంహరించలేరు. వారిలో వారు కలహించుకుని పరస్పరం అంతమొందించుకుంటారు. యాదవ కులం వృష్ణి వంశంలో భాగం. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన యాదవుల ప్రస్తుత పరస్పర కలహం దాన్నే గుర్తుతెస్తోంది. ఆనాటి గాంధారి శాపాన్ని ఈ పరిణామం నిజం చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ చీలిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో లబ్ధి పొందేది బహుజన్ సమాజ్‌వాదీ పార్టీనే. దీనికి అధ్యక్షురాలు మాయావతి. సమాజ్‌వాదీలో కలహం బీజేపీకి సంతోషం కలిగిస్తోంది. ఇది ఆ పార్టీకి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కానీ అది బీఎస్పీకి ఒనగూరే స్థాయిలో మాత్రం ఉండదు. చరిత్ర నుంచి పాఠాలు నేర్వకుంటే, పురాణాలలో మాదిరి పరిణామాలు పునరావృతమవుతాయి. అందుకు తాజాగా యాదవుల సంకుల సమరమే ఉదాహరణ.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి