ఈమధ్య వచ్చిన తమిళ చిత్రాల్లో క్లాసిక్‌గా మిగిలిపోయిన సినిమా ’96’. ఈ సినిమా చూసి చాలామంది ఫ్లాటైపోయారు. సమంత ఈ సినిమా చూడగానే.. ‘దీన్ని ఏ భాషలోనూ రీమేక్ చేయకుండా ఉండడమే మంచిది. ఈ ఫీల్‌ని మరెవ్వరూ క్యారీ చేయలేరు’ అంది. అయితే యాదృచ్చికంగా సమంతనే ’96’ తెలుగు రీమేక్‌లో కథానాయికగా ఎంపికైంది. ‘రీమేక్ చేయకూడదు అని చెప్పిన కథానాయికనే రీమేక్‌లో తీసుకోవడం దిల్‌రాజు గట్స్‌కి నిదర్శనం. సమంతని ఒప్పించడం ఎలా సాధ్యమైంది??’ అని దిల్‌రాజుని అడిగితే.. ఆసక్తికరమైన సమాధానం చెప్పుకొచ్చారు.
”ఈ సినిమా విడుదలకు ముందే నేను చూశా. తెలుగులో ఈ సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుంది అని అప్పుడే అనిపించింది. ఆ మరు నిమిషమే రైట్స్ తీసుకున్నా. దర్శకుడ్ని కూడా కన్ఫామ్ చేశా. తగిన నటీనటులు దొరికితే… తప్పకుండా తెలుగు రీమేక్‌కి నేను దర్శకత్వం వహిస్తా అని తమిళ దర్శకుడు నాతో చెప్పారు. వెంటనే సమంతని అప్రోచ్ అయ్యా. అయితే ’96’ రీమేక్ గురించి అప్పటికే కొన్ని పత్రికలలో వార్తలొచ్చేశాయి. అల్లు అర్జున్, గోపీచంద్ .. ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. దాంతో సమంత అలా స్పందించి ఉంటుంది. ఈ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలీక మాట్లాడేసింది” అని చెప్పుకొచ్చాడు దిల్‌రాజు. తమిళంలో చేసిన మ్యాజిక్ తెలుగులోనూ రిపీట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు దిల్‌రాజు. ”ఇన్నేళ్ల కెరీర్లో నేను చేస్తున్న తొలి రీమేక్ ఇది. ఈ కథపై నాకు అంత నమ్మకం. నాకు తమిళ డైలాగులు పూర్తిగా అర్థం కావు. కానీ.. సినిమాలోని ఎమోషన్‌కి కనెక్ట్ అయిపోయాను. అది చాలనిపించింది. `96` అనేది తమిళంలో ఓ క్లాసిక్. అదే మ్యాజిక్ తెలుగులోనూ రిపీట్ అవుతుంది” అని ధీమా ప్రదర్శించారు.