కుమారి సమంత కాస్త… శ్రీమతి సమంతగా మారబోతోంది. కొద్ది గంటల్లో నిజ జీవితంలో ఓ ప్రమోషన్ అందుకోబోతోంది సమంత. ఇప్పుడు కెరీర్ పరంగానూ ప్రమోషన్ వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకొన్న సమంత – ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. సమంత త్వరలోనే ఓ హిందీ సినిమా చేయబోతోందని టాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. అది నిజమే అని టాక్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా ఇటీవల సమంతని సంప్రదించాడు. వీరిద్దరి మధ్య హిందీ చిత్రానికి సంబంధించిన చర్చలు జరిగాయని టాక్. బాలీవుడ్లో సినిమా చేసేందుకు సమంత కూడా ఒప్పుకొందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఘాజీ తో దక్షిణాదిని ఆకట్టుకొన్న దర్శకుడు సంకల్ప్. బాలీవుడ్‌లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను అందుకొంది. సంకల్ప్ తదుపరి సినిమా కూడా బహు బాషా చిత్రమే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. అందులో కథానాయికగా సమంతని ఎంచుకొన్నారన్నమాట. 2018 ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.