జనతా గ్యారేజ్ తరవాత సినిమాలేం ఒప్పుకోలేదు సమంత. సినిమాల కంటే వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఆమె నుంచి కొత్త సినిమా కబుర్లు వినిపించి చాలాకాలమైంది. ఇప్పుడిప్పుడే మెల్లగా కథలు వినడం మొదలెట్టింది. అందులో భాగంగా ‘మహానటి’ కథకు ఓకే చెప్పింది సమంత. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతోంది. అయినా… సమంతకూ ఓ మంచి పాత్ర దక్కింది. `మహానటి` చిత్రంలో సమంత ఓ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్టు టాక్. సావిత్రి ఆత్మ కథని రాసే జర్నలిస్టు పాత్ర ఈ కథలో కీలకమట. ఆ పాత్ర దృష్టి కోణం నుంచే సావిత్రి కథ మొదలవుతుందని తెలుస్తోంది. అందుకే జర్నలిస్టు పాత్ర కోసం సమంతని తీసుకొన్నారట. నిజానికి సావిత్రిగా సమంత పేరూ అనుకొన్నారు. అయితే ఆ పాత్ర కోసం బరువు పెరగడం, మళ్లీ తగ్గడం లాంటి కష్టమైన కసరత్తులు చేయాల్సివచ్చిందట. అందుకే సమంత డ్రాప్ అయ్యిందట.
కాకపోతే స్క్రిప్టు నచ్చి… జర్నలిస్టు పాత్ర ఇస్తే చేస్తానని అడిగిందట. దాంతో… సావిత్రి పాత్ర పోయి… జర్నలిస్టు పాత్రతో సర్దుకుపోవాల్సివచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2017 ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుంది. ఎవడే సుబ్రమణ్యంతో ఆకట్టుకొన్న నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె, గోపాల గోపాల, గౌతమి పుత్ర, ఖైదీ చిత్రాలకు సంభాషణలు అందించిన బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది అశ్వనీదత్ ప్లాన్. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.