చేనేత రంగ అభివృద్ది కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయో, ఏం చేయబోతున్నాయో తెలీదు గానీ.. ముందు మాత్రం బ్రాండ్ అంబాసిడర్లను నియమించి.. సెభాష్ అనిపించుకొన్నాయి. ఏపీలో ఆ బాధ్యత తనకు తాను పవన్ కల్యాణ్ తీసుకొంటే… తెలంగాణలో మాత్రం ఆ పనిని ప్రభుత్వం సమంత చేతికి అప్పగించింది. అటు పవన్.. ఇటు సమంత… చేరికతో చేనేతకు కొత్త గ్లామర్ వచ్చినట్టైంది. సమంత ఎంపిక అప్పట్లో కాస్త వివాదాలకు దారి తీసింది. సమంతనే ఎందుకు ఎంచుకొన్నట్టు? అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడానికి ప్రయత్నించింది. ఎప్పుడూ చీర కట్టని సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే చేనేత కు ఒరిగేదేంటి? అంటూ ఎద్దేవా చేసినవాళ్లూ ఉన్నారు. అంతేకాదు.. ఏపీలో ఆ బాధ్యత పవన్ తీసుకొన్నందకు దానికి కౌంటర్‌గా సమంతని రంగంలోకి దించారు తప్ప.. తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ప్రేమేంలేదని విమర్శించారు.
అయితే ఇలాంటి విమర్శల్ని ప్రభుత్వం పట్టించుకొన్నా.. సమంత మాత్రం లైట్ తీసుకొంది. అంతే కాదు.. వెంటనే కార్య సాధనలో దూసుకుపోయింది. ఇటీవలే సిద్దిపేట వెళ్లి అక్కడ చేనేత కార్మికుల్ని పలకరించి వచ్చింది సమంత. చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ కావడం తన జీవిత కాల కల అన్నట్టు ట్వీట్లతో మోత మోగించింది. సమంత.. దూకుడు చూస్తుంటే… ఈ విషయంలో పవన్ బాగా వెనకబడినట్టే అనిపిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ అయిన తరవాత.. కార్మికులకు సంఘీభావం తెలపడం మినహా పవన్ చేసిందేం లేదు. బ్రాండ్ అంబాసిడర్ హోదాలో `నా అభిమానులంతా వారానికి ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించండి` అంటూ చెప్పిందీ లేదు. కోట్ల కొద్దీ డబ్బులిచ్చే కమర్షియల్ యాడ్లకు నో చెప్పిన పవన్ – చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలబడడానికి ఒప్పుకొన్నాడంటే అది కచ్చితంగా పవన్ గొప్ప మనసుకి నిదర్శనమే. అయితే… తన మంచితనం మాటల వరకే కాకుండా చేతల్లోనూ చూపిస్తే బాగుంటుంది. సమంత కంటే స్ట్రాంగ్ గా.. ఏపీలో చేనేతకు ప్రచారం తీసుకొస్తే.. బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ తన వంతు న్యాయం చేసినట్టే.