కొన్ని సినిమాలతో హీరో, హీరోయిన్లు వ్యక్తిగతంగా ఎటాచ్ అయిపోతుంటారు. సమంత అయితే…. తనకు పాత్ర నచ్చితే.. అందులో లీనమైపోతుంది. ఆ సినిమా కోసం సెట్స్ లో కష్టపడడమే కాదు, సినిమా పూర్తయ్యాక ప్రమోషన్ ఘట్టాన్నీ తన నెత్తిమీద వేసుకుంటుంది. `యూ టర్న్`, `మజిలీ` సినిమాలకు ఇదే జరిగింది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్‌లో సమంత యాక్టీవ్‌గా పాల్గొంది. ఇప్పుడు `ఓ బేబీ `విషయంలోనూ అదే జరుగుతోంది. సమంతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయిపోయినట్టుంది. అందుకే.. ప్రమోషన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటోంది. స్టార్ హీరోయిన్లు సాధారణంగా ప్రమోషన్లకు రావడానికి తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారు. కానీ సమంత మాత్రం… అలా కాదు. `ఓ బేబీ` ప్రమోషన్లు ఎలా చేయాలి? ఏం చేయాలి? అనే విషయంలో చిత్రబృందంకి సమంతనే సలహాలూ సూచనలు అందిస్తోంది. ప్రమోషన్ ఘట్టాన్ని దగ్గరుండి చూసుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్లు పూర్తయ్యాక, ఇక చేయాల్సింది ఏం లేదు అనుకున్న తరవాతే.. మరో సినిమా షూటింగ్లో కాలు మోపాలని సమంత నిర్ణయించుకుందట. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం లాంటి పలు నగరాల్లో ఓబేబీ ప్రమోషన్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఈ అన్ని ఈవెంట్లలోనూ సమంత పాలు పంచుకోనుంది. ఇక టీవీ, ఎఫ్ ఎమ్, ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలు కూడా జోరుగానే సాగుతున్నాయి. మొత్తానికి తెరపైనే కాదు, తెర వెనుక కూడా సమంత కర్త, కర్మ. క్రియగా మారిపోయింది.