96ని తెలుగులో రీమేక్ చేస్తారనుకున్నప్పుడు కథానాయిక ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే తమిళంలో త్రిష అద్భుతంగా నటించేసింది. ఇప్పుడు తెలుగులో సినిమా వస్తోందంటే, ఎవరు ఎంత నటించినా, త్రిషతో పోలికలు మొదలెట్టేస్తారు. ఏమాత్రం ఎక్కువ తక్కువలు చేసినా దొరికిపోవడం ఖాయం. అందుకే కథానాయికలెవరూ ఈ సినిమా చేయడానికి ధైర్యం చేయలేదు. కానీ సమంత ముందుకొచ్చింది. సమంత మాత్రమే త్రిష పాత్రకు న్యాయం చేయగలదు అని తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే అంతకు ముందే `ఓ బేబీ`లో సమంత తన నట విశ్వరూపం చూపించేసింది. అందుకే సమంతపై అంత నమ్మెకం. కానీ సమంత ఈ సినిమాని అంత తేలిగ్గా ఒప్పుకోలేదు. ముందు `నో` చెప్పింది. ఆ తరవాత కండీషన్లు పెట్టింది. ఈ సినిమా ఎక్కడ ఒప్పుకోవాల్సివస్తుందో అని కొన్ని రోజులు దిల్ రాజుని తప్పించుకుని తిరిగింది. ఈ విషయం సమంతే చెప్పింది.
“తమిళంలో ఈ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు చేస్తున్నారని తెలిసింది. ఆయన్నుంచి ఫోన్ వస్తే భయపడిపోయాను. `లేను.. ఒంట్లో బాలేదని చెప్పు` అంటూ తప్పించుకుని తిరిగాను. ఎందుకంటే త్రిష, విజయ్ సేతుపతి పాత్రల్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. అందుకే చేయకూడదనుకున్నా. అయితే దిల్ రాజుని కలిసిన వెంటనే.. ఈ సినిమా చేస్తున్నానని ఒప్పేసుకున్నా. ఆయన ఒప్పించేశారు. హైదరబాద్ రాగానే నేను అడుగు పెట్టింది ఆయన ఆఫీసులోనే. ఆ అనుబంధంతోనే ఈ సినిమా చేశాను” అంది. అయితే సమంత మాత్రం చాలా కండీషన్లు పెట్టింది. మాతృక తీసిన దర్శకుడిని తీసుకురావాలన్నది తొలి కండీషన్. సంగీత దర్శకుడినీ, కెమెరామెన్నీ అక్కడి నుంచే తీసుకొచ్చారు. ఇదంతా సమంత కోసమే.