సమంత వేరు… అక్కినేని సమంత వేరు.
ఇంటిపేరు మారాక సమంత తీరూ మారింది.
పద్ధతైన పాత్రలు, ఛాలెంజ్ విసిరే పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చెక్ పెట్టేసింది. సినిమా అంతటినీ తన భుజాలపై వేసుకుని నడిపించేంత శక్తిని కూడదీసుకుంది. అలాంటి మరో ప్రయత్నమే `ఓబేబీ`. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సమంతతో చిట్ చాట్.
హాయ్ సమంత…
– హాయ్..
ఓ బేబీ హ్యాంగోవర్లోనే ఉన్నారా? బయటకు వచ్చేశారా?
నాకూ వచ్చేయాలనే ఉంది. ఈ సినిమా విడుదలయిన తరవాత.. అసలు ఓ బేబీ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే అంతలా ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ మాట్లాడుతూనే ఉన్నాను.
ఈమధ్య సినిమా ప్రమోషన్లను కూడా మీ మేదే వేసుకుని నడిపిస్తున్నారు. కారణం ఏమిటి?
మజిలీ విషయంలో అలాజరిగింది. ఎందుకంటే పెళ్లయ్యాక చై తో కలసి చేసిన సినిమా అది. సినిమా బాగుండాలి. అందుకే బాధ్యత ఎక్కువైంది. ఓ బేబీ అంటారా? ఈ సినిమాని నేను తప్ప మోయడానికి ఇంకెవరూ కనిపించలేదు. మంచి సినిమా, జనాల్లోకి వెళ్లాలంటే ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందే.
తిరుపతి కూడా కాలి నడకన వెళ్లారు. అది సెంటిమెంట్‌గా మారిందా?
చైతూ సినిమా విడుదల అవుతున్నప్పుడు తిరుపతి వెళ్లడం అలవాటు చేసుకున్నాను. నా సినిమా విడుదల సమయంలో తిరుపతికి వెళ్లడం ఇదే తొలిసారి.
వినోదం, భావోద్వేగాలు, కుటుంబ బంధాలూ… ఇలా అన్నీ ఉండే ప్యాకేజీలాంటి సినిమా ఓబేబీ. కావాలనే ఇలాంటి కథని ఎంచుకున్నారా?
అవునండీ. కావాలనే ఈ కథని ఎంచుకున్నా. `యూటర్న్` అనే ఓ సినిమా చేశాను. అదో థ్రిల్లర్. ఆ సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా గురించి చాలామంది గొప్పగా చెప్పారు. కానీ ఆర్థికంగా మాత్రం నిలబడలేదు. దానికేం బాధ పడడం లేదు. ఎవరినీ నిందించడం లేదు కూడా. మేం ఓ వర్గానికి మాత్రమే నచ్చే సినిమా తీశాం. అందుకే అలాంటి ఫలితం వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఓబేబీలాంటి కథ ఎంచుకున్నా. ఈ సినిమాలో అన్ని రకాల అంశాలూ ఉన్నాయి. చూద్దాం.. ఈ సినిమా కూడా ఆడకపోతే.. నేనేం చేయలేను (నవ్వుతూ)
రీమేక్ సేఫ్ జోన్ అనుకుంటున్నారా?
నిజానికి రీమేక్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ వరుసగా నాకు అలాంటి కథలే వస్తున్నాయి. `మిస్ గ్రానీ` కథ దాదాపు ఏడు భాషల్లో సూపర్ హిట్టయ్యింది. అదో క్లాసిక్. అలాంటి కథని తెలుగులో తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే… మేం రైట్స్ తీసుకున్నాం కదా, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని అనుకోలేదు. మిస్ గ్రానీ సినిమా టీమ్‌తో మేం నాలుగు గంటలు మాట్లాడం. ప్రతీ సీన్ వెనుక కథని తెలుసుకున్నాం. ఆ ఎమోషన్ని అర్థం చేసుకున్నాం.
ఆ తరవాతే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.
దర్శకురాలిగా నందినిని ఎంచుకోవాలన్న ఆలోచన మీదే. తనే ఎందుకు…?
తను నాకు చాలా కాలంగా తెలుసు. మంచి స్నేహితురాలు. అంతకు మించి చాలా సెన్సిటీవ్. నిజాయతీగా పని చేస్తుంది. ఈ కథని తను బాగా అర్థం చేసుకోగలదు అనిపించింది.
మహిళా దర్శకులతో పనిచేయడంలో సౌలభ్యాలున్నాయా?
ఈ ప్రశ్నే నాకు నచ్చదు. చిత్రసీమలో టాలెంట్ కావాలి. ఆడ, మగ అనే తేడా లేదు. మా టీమ్‌లో మహిళలు ఎక్కువ. వీళ్లంతా ఏం చేస్తారులే… అని జనం అనుకుంటారని మాకు తెలుసు. అందుకే అందరి కంటే ఎక్కువ కష్టపడ్డాం.
వరుసగా విజయాలొస్తున్నాయి.. సినిమా సినిమాకీ ఒత్తిడి పెరుగుతుందా?
నాపై నేనే ఒత్తిడి పెంచుకుంటూ ఉంటాను. గత సినిమా కంటే ఈ సినిమా బాగుండాలని ఆశ పడుతుంటాను. అంతకు మించిన ఒత్తిడేం ఉండదు.
ఫలానా దర్శకుడితో పనిచేయాలన్న కోరికలేమైనా ఉన్నాయా?
శేఖర్ కమ్ములగారితో పనిచేయాలని వుంది. కథానాయికల పాత్రల్ని ఆయన బాగా తీర్చిదిద్దుతారు. ఇక మణిరత్నంసార్తో పనిచేయాలన్నది నా కల. ప్రతీ కథానాయికా అదే అనుకుంటుందేమో..?