సమంత ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం `యశోద`. 11న విడుదల అవుతోంది. ఈ సినిమాకి మూలస్థంభం.. సమంతనే. తనని చూసే జనాలు థియేటర్లకు రావాలి. తనతోనే బిజినెస్ జరుగుతుంది. అయితే అలాంటి సమంత అనారోగ్యం పాలైంది. ఇప్పుడు దీర్ఘకాలిక విశ్రాంతి తీసుకోవాల్సిన తరుణం. దాంతో యశోద ప్రమోషన్లలో సమంత కనిపించే ఛాన్స్ లేనట్టే అనుకొన్నారు. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అయిన సమంత.. ప్రమోషన్లలో లేకపోవడం ఈ సినిమాకి పెద్ద దెబ్బే. సమంతే లేకపోతే.. ఈ సినిమా ప్రమోషన్లకు కళ ఎక్కడిది?
అయితే ఇప్పుడు సమంత ఓ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగం పంచుకోవడానికి ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది కూడా. సమంత నిర్ణయం `యశోద` దర్శక నిర్మాతల్లో ఆనందాన్నికలిగిస్తోంది. ఆరోగ్యం సహకరించకపోయినా.. తను ప్రమోషన్లలో పాల్గొనాలని చూడడం నిజంగా గొప్ప విషయమే. సినిమా పట్ల సమంతకు ఉన్న నిబద్ధతని ఈ సంఘటన మరోసారి బయటపెట్టింది. అయితే ఇది వరకటిలా… ఎడాపెడా ప్రమోషన్లు చేయకపోవొచ్చు. ఓ వీడియో ఇంటర్వ్యూ.. ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో సమంత పాల్గొనే అవకాశం ఉంది. పైగా సినిమా విడుదలకు ఎంతో సమయం కూడా లేదాయె. సమంత ఇలా వచ్చి అలా కనిపించినా.. ప్రమోషన్ అయిపోయినట్టే అని నిర్మాత భావిస్తున్న ఈ తరుణంలో.. సమంత నిర్ణయం ఈ సినిమాకి బూస్టప్ ఇచ్చినట్టైంది.