రామరాజు.. తీసింది ఒక్క సినిమానే. దానికి డబ్బులే రాలేదు. అయినా… రామరాజు అంటే ఏంటో ఇండ్రస్ట్రీకి తెలిసిపోయింది. క్లాస్ సినిమాల్ని తీయగల సమర్థుడు అని నిరూపించుకొన్నాడు. ఇప్పుడు ఒక మనసు సినిమాతో మరోసారి అలాంటి క్లాస్ ని మెప్పించడానికి సిద్ధమయ్యాడు. మెగా హీరోయిన్ నిహారిక ని ఎంచుకొని అందరి దృష్టినీ ఈ సినిమావైపుకు మళ్లించాడు. అయితే ముందుగా ఈ పాత్రకోసం సమంతని సంప్రదించారట. సమంత కి ఈ కథ బాగా నచ్చిందని, అయితే కాల్షీట్లు సర్దుబాటు చేయలేక వదులుకొందని రామరాజు చెబుతున్నారు. ఆ తరవాత రెజీనా దగ్గరకు వెళ్లిందట. రెజీనా కూడా ఇదే సమస్య చెప్పడంతో.. చివరికి నిహారిక ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.
మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు సినిమా తరవాత సినిమాలు తీయకూడదనుకొన్నాడట రామరాజు. సినిమా అంటే కళ కాదు వ్యాపారం అనే విషయం తెలుసుకోవడానికి కొంత సమయం పట్టిందట. అయితే… తానెప్పుడూ దిగజారిన సినిమాల్ని తీయలేనని, దానికి కంటే సినిమాలకు దూరంగా ఉండడమే ఉత్తమమని చెప్పుకొచ్చాడు. ఓ స్వచ్ఛమైన ప్రేమకథని ఒక మనసు ద్వారా ఆవిష్కరించగలిగానన్న సంతృప్తి వ్యక్తం చేశాడు రామరాజు. మరి ఒక మనసు ఎలా ఉంటుందో తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే.